కై కలూరు: పక్షి ప్రేమికుల స్వర్గథామం ఆటపాక పక్షుల విహార కేంద్రం కొత్త కళను సంతరించుకుంటోంది. విదేశీ, స్వదేశీ పక్షులతో కలకలలాడే కేంద్రం చెరువు వేసవిలో ఎడారిని తలపించింది. రెండు నెలల తర్వాత చెరువులో నీటి జాడలు కనిపిస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు పచ్చటి పచ్చిక బయళ్లు ఆకట్టుకుంటున్నాయి. పక్షుల కేంద్రం సందర్శనలో కీలకమైన బోటు షికారు త్వరలో పునఃప్రారంభం కానుంది. అరుదైన పెలికాన్ పక్షుల ఆవాస కేంద్రంగా పేరుగడించిన కేంద్రంలో అతిథి పక్షులుగా ఫ్లెమింగోలు సందడి చేస్తున్నాయి. పెలికాన్(గూడబాతు) పక్షులు అత్యధికంగా వలస వచ్చి సంతానోత్పత్తి చేయడంతో ఆటపాక పక్షుల విహార కేంద్రానికి ‘పెలికాన్ ఫ్యారడైజ్’గా నామకరణం చేశారు. ఇక్కడ పక్షుల విహారానికి 285 ఎకరాల విస్తీర్ణంలో చెరువు అందుబాటులో ఉంది. అటవీశాఖ పక్షుల ఆవాసాల కోసం 150 కృత్రిమ ఇనుప స్టాండ్లను ఏర్పాటు చేశారు. పర్యాటకులు దగ్గర నుంచి పక్షుల కేరింతలను వీక్షించడానికి మూడు బోట్లును అందుబాటులో ఉంచారు. పక్షుల కేంద్రలో పర్యావరణ విద్యాకేంద్రం వద్ద పరుచుకున్న పచ్చటి బయళ్లు ఆకట్టుకుంటున్నాయి.
రూ.7 లక్షలతో అభివృద్ధి పనులు
ఆటపాక పక్షుల విహార కేంద్రం అభివృద్ధికి అటవీశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఇటీవల రూ.2 లక్షల నిధులతో టిక్కెట్టు కౌంటర్ నుంచి పర్యావరణ విద్యా కేంద్రం వరకు రోడ్డును ఏర్పాటు చేశారు. అదే విధంగా చెరువు గట్లు దెబ్బతినడంతో మట్టిని పోసి పటిష్ట పర్చారు. కేంద్రంలో పక్షుల ఆవాస కృత్రిమ స్టాండ్లు 32 పాడయ్యాయి. వాటి స్థానంలో రూ.5 లక్షలు వెచ్చించి కొత్తవి తయారు చేయించారు. పర్యావరణ విద్యాకేంద్రం (ఈఈసీ)ని సుందరంగా తీర్చిదిద్దారు. ఆరు బయట గోడలపై పక్షుల చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. మరిన్ని అభివృద్ధి పనులకు ప్రణాళిక సిద్ధం చేశారు.
పోల్‌రాజ్ డ్రెయిన్ నుంచి నీటి విడుదల
ఆటపాక పక్షుల విహార కేంద్ర చెరువుకు సమీపంలోని పోల్‌రాజ్(నాగరాజు) డ్రెయిన్ నుంచి ప్రతి ఏటా నీటిని తోడుతారు. అడుగున తూములను ఏర్పాటు చేశారు. వీటిని తీయడంతో నీరు చెరువులోకి చేరుతోంది. మరో 15 రోజుల్లో చెరువు పూర్తి స్థాయిలో నిండుతుందని భావిస్తున్నారు. చెరువులో 4 అడుగులు నీరు చేరితే బోటు షికారుకు అవకాశం ఉంటుంది. వర్షాలు మరింత విస్తారంగా కురిస్తే త్వరగా నీరు చేరుతోందని అటవీశాఖ సిబ్బంది చెబుతున్నారు.
ఆటపాక పక్షుల విహార కేంద్రం గట్లను పూర్తిస్థాయిలో పటిష్టపర్చడానికి ప్రణాళిక రూపొందించాం. అంచనాల నివేదికను ఉన్నతాధికారులకు అందించాం. ఇటీవల రూ.5 లక్షలతో పక్షుల విహార కృత్రిమ ఇనుప స్టాండ్లను తయారు చేయించాం. త్వరలో ఆటపాకలో బోటు షికారు అందుబాటులోకి వస్తుంది.
– కే.రామలింగాచార్యులు, రేంజర్, కై కలూరు
ఆటపాక పక్షుల విహార కేంద్రం ప్రవేశ ద్వారం
ఫ్లెమింగో పక్షులు (ఫైల్)
రెండు నెలల తర్వాత చెరువుకు నీరు
రూ.5 లక్షలతో స్టాండ్లకు మరమ్మతులు
అతిథులుగా ఫ్లెమింగో పక్షుల సందడి
త్వరలో బోటు షికారుకు అవకాశం


