● 20 నెలలకుగాను మొక్కుబడిగా 4 నెలల టీఏ చెల్లింపు
● పూర్తిస్థాయిలో అలవెన్సులు చెల్లించాలంటున్న పోలీస్ సిబ్బంది
భీమవరం: ప్రజాప్రతినిధులు, రాజకీయనాయకులు, ప్రజలకు రక్షణ ఉండే పోలీసు ఉద్యోగులకు దాదాపుగా రెండేళ్లుగా ట్రావెలింగ్ అలవెన్స్(టీఏ) బకాయిలు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో ఎట్టకేలకు జూన్ 30వ తేదీన మొక్కుబడిగా 4 నెలల టీఏ బకాయిలు చెల్లించి చేతులు దులుపుకున్నారు. జిల్లాలో ఏడు పోలీసు సర్కిళ్ల పరిధిలో సుమారు 25 పోలీసుస్టేషన్లు, 3 ట్రాఫిక్ పోలీసుస్టేషన్లు ఉండగా వాటిలో దాదాపు 1,200 మంది అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారు. సర్కిల్ ఇన్‌స్పెకర్ట్ నుంచి కానిస్టేబుల్ వరకూ ప్రతి నెలా జీతంతోపాటు ట్రావెలింగ్ అలవెన్స్‌లు ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది. విధి నిర్వహణలో భాగంగా బందోబస్తు నిమిత్తం పోలీసులు జిల్లాలో ఎక్కడైనా పనిచేయాల్సి ఉంటుంది. ప్రజలకు రక్షణగా రాత్రి, పగలు పనిచేస్తుంటారు. అంతేగాకుండా ప్రజాప్రతినిధులు నిర్వహించే సభలు, సమావేశాలు సక్రమంగా ముగిసేవరకు వీరిదే బాధ్యత. ఎండ, వానలను లెక్క చేయకుండా నిరంతరం పనిచేయాల్సిందే. వీరికి ప్రతినెలా జీతంతోపాటు టీఏ కూడా జమ చేయాల్సిన ప్రభుత్వం గత 20 నెలలుగా నిర్లక్ష్యం చేస్తోంది. దీంతో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నామంటూ పోలీస్ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మొక్కుబడిగా నాలుగు నెలలకు మాత్రమే టీఏ చెల్లించడం అన్యాయమని వాపోతున్నారు. విద్యాసంవత్సరం ప్రారంభం కావడంతో పెద్ద మొత్తంలో విద్యాసంస్థల ఫీజులు, విద్యాసామాగ్రి కొనుగోలుకు ఇబ్బందులు పడుతున్నామని, ఇటువంటి తరుణంలో ప్రభుత్వం బకాయి ఉన్న మొత్తం టీఏ చెల్లించాలని పోలీసు అధికారులు, సిబ్బంది కోరుతున్నారు.


