సేంద్రియ సాగు ఎంతో మేలు
చింతలపూడి: రైతులు రసాయనిక ఎరువులకు స్వస్తి పలికి, సేంద్రీయ ఎరువుల వైపు మొగ్గు చూపాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుత తరుణంలో రసాయనిక ఎరువులను విపరీతంగా వాడటం వల్ల సాగు ఖర్చులు పెరిగి రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారని చెబతున్నారు. సేంద్రియ పద్ధతులను పాటిస్తే ఖర్చులు తగ్గడమే కాకుండా నాణ్యమైన, విషరహిత పంటల ద్వారా అధిక లాభాలు సాధించవచ్చని పేర్కొంటున్నారు.
సేంద్రియ
ఎరువులతో భూసార రక్షణ
పశువుల ఎరువు, వానపాముల ఎరువు, గొర్రెలు, కోళ్ల ఎరువులతో పాటు పచ్చిరొట్ట ఎరువులు సేంద్రీయ సాగులో కీలకమైనవి. వీటి వాడకం వల్ల భూమి తన సహజ స్థితిని సంతరించుకోవడమే కాకుండా, పంటకు అవసరమైన ప్రధాన, సూక్ష్మ పోషకాలు అందుతాయి. వీటితో పాటు వేరుశనగ, వేప, పొద్దుతిరుగుడు, ఆముదం పిండిని వాడితే మొక్కలకు మరింత పోషక విలువలు లభిస్తాయి.
దిగుబడిని పెంచే పచ్చిరొట్ట ఎరువులు
సమగ్ర పోషక యాజమాన్యంలో పచ్చిరొట్ట ఎరువుల పాత్ర అమోఘం. ఇవి పంటల దిగుబడిని గణనీయంగా పెంచుతాయి. పచ్చిరొట్ట పైర్లలో జీలుగ, జనుము, పిల్లిపెసర, అలసంద, పెసర, మినుము వంటివి ముఖ్యమైనవి.
జీవ ఎరువులతో అధిక లాభాలు
పంటల పెరుగుదలకు అవసరమైన పోషకాలను అందించే సూక్ష్మజీవ కణాల సముదాయాలనే ‘జీవ ఎరువులు’ అంటారు. ఇవి ప్రధానంగా రెండు రకాలుగా ఉంటాయి. రైజోబియం, అజటోబాక్టర్, అజోస్పైరిల్లం, నీలి ఆకుపచ్చ నాచు, అజొల్లా వంటివి నత్రజనిని స్థిరీకరిస్తాయి. అయితే ఫాస్ఫో బ్యాక్టీరియా భాస్వరాన్ని కరిగించేవిగా ఉంటాయి. ఇవి ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.
నీలి ఆకుపచ్చ నాచు
ఎకరానికి 4 కిలోల నాచు పొడిని ఇసుకతో కలిపి పొలమంతా సమానంగా చల్లాలి. ఆ తర్వాత 7 నుండి 10 రోజుల పాటు మడిలో నీరు నిల్వ ఉండేలా చూసుకోవాలి. ఈ నాచు గాలిలోని నత్రజనిని గ్రహించి భూమిలో స్థిరీకరిస్తుంది. దీనివల్ల ఎకరానికి 8–12 కిలోల నత్రజని పంటకు అందడమే కాకుండా దిగుబడి కూడా పెరుగుతుంది.
అజటోబాక్టర్
ఎకరానికి సరిపడే విత్తనానికి 200–400 గ్రాముల కల్చర్‌ను పట్టించి విత్తుకోవాలి. లేదా ఒక కిలో కల్చర్‌ను 20 కిలోల పశువుల ఎరువుతో కలిపి నేలపై చల్లుకోవచ్చు. వరి, చెరకు, జొన్న, పత్తి, సజ్జ, మిరప పంటలకు ఇది ఎంతో మేలు చేస్తుంది. దీని ద్వారా ఎకరానికి 8–16 కిలోల నత్రజని పైరుకు అందుతుంది.
అజొల్లా సాగు విధానం
పొలం దమ్ములో ఎకరానికి 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసి, పలుచగా నీరు పెట్టాలి. ఆపై 100–150 కిలోల అజొల్లాను వేసి, 2–3 వారాల తర్వాత నేలలో కలియదున్నాలి. దీనివల్ల ఎకరానికి 3 టన్నుల పచ్చిరొట్టతో పాటు 12 కిలోల నత్రజని లభిస్తుంది.
భాస్వరపు జీవ ఎరువు
ఎకరానికి సరిపడే విత్తనానికి 200–400 గ్రాముల కల్చర్‌ను పట్టించాలి. లేదా ఒక కిలో కల్చర్‌ను 20 కిలోల పశువుల ఎరువుతో కలిపి నేరుగా పొలంలో చల్లాలి. ఇది భూమిలో కరగని స్థితిలో ఉన్న భాస్వరాన్ని కరిగించి మొక్కలకు అందిస్తుంది.
రైతులు సేంద్రియ సాగు వైపు మళ్లితే ఎన్నో లాభాలు పొందవచ్చు. ఒకవేళ రసాయనిక ఎరువులను వాడాల్సి వస్తే, కేవలం సిఫార్సు చేసిన మోతాదులోనే వాడాలి. పరిమితికి మించి రసాయనాలు వాడితే పురుగులు, తెగుళ్ల ఉధృతి మరింత ఎక్కువవుతుంది.
– సుబ్బారావు, ఏడీఏ


