కామవరపుకోట: ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఎవరూ భయపడే ప్రసక్తే లేదని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోరుముచ్చు గోపాల్ యాదవ్ స్పష్టం చేశారు. కారుమూరి సునీల్ కుమార్ అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ, మంగళవారం మాజీమంత్రి కారుమూరి నాగేశ్వరావు నివాసానికి వెళ్లిన ఆయన, కారుమూరి కుటుంబానికి తన పూర్తి సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా గోపాల్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన కాకుండా శ్రీరెడ్ బుక్‌శ్రీ రాజ్యాంగం నడుస్తోందని మండిపడ్డారు. కారుమూరి సునీల్ కుమార్ అరెస్టు ముమ్మాటికీ రాజకీయ కుట్రేనని, ఈ అక్రమ కేసులను చట్టపరంగా, న్యాయస్థానాల ద్వారా తిప్పికొడతామని స్పష్టం చేశారు.
దెందులూరు: జాతీయ రహదారిపై గుండుగొలను నుంచి ఏలూరు వెళుతుండగా కొమురేపల్లి గరుడ హోటల్ వద్ద సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియ వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన చోటు చేసకుంది. ఈ ప్రమాదంలో గోలి రమేష్‌బాబు అనే తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని కుటుంబ సభ్యులు, పోలీసులు వైద్యశాలకు తీసుకు వెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
భీమవరం: భీమవరం వన్‌టౌన్‌లోని సుంకరపద్దయ్య వీధిలో విద్యుత్ షాక్‌తో ఏసీ మెకానిక్ మృతి చెందాడు. ఉండి మండలం యండగండి సమీపంలోని రాయనివారిగూడేనికి చెందిన కాలా వెంకటసాయి గణపతి (21) ఏసీ పనిచేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. చికిత్స నిమిత్తం వెంటనే పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఖాళీ సమయంలో పట్టణంలోని ఓ ప్రైవేటు ఐటీఐ కళాశాలలో పార్టుటైం అధ్యాపకుడిగా పనిచేస్తూనే వృత్తిరీత్యా ఏసీల మరమ్మతుల పనులు చేస్తుంటాడని స్థానికులు చెబుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీ వద్ద ఉంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
తాడేపల్లిగూడెం రూరల్: పాము కాటు వేయడంతో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందినట్లు రూరల్ ఎస్సై రవికుమార్ మంగళవారం విలేకరులకు తెలిపారు. మండలంలోని పుల్లాయగూడెం గ్రామానికి చెందిన నౌడూరి జ్యోతిబాబు (38) సోమవారం సాయంత్రం పని ముగించుకుని ఇంటికి వచ్చి స్నానం చేసేందుకు పెరట్లోకి వెళ్లగా, చెట్టుపై నుంచి పాము తలపై పడి కాటు వేసింది. దీంతో అతనిని మోటారు సైకిల్‌పై తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం ఉన్నత వైద్యం కోసం ఏలూరు రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. ఈ మేరకు మృతుడి భార్య నౌడూరి ధనలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు.
ఏలూరు టౌన్: జిల్లా పోలీస్‌శాఖలో విధులు నిర్వర్తిస్తూ పదవీవిరమణ చేసిన ఏడుగురు పోలీసు అధికారులకు మంగళవారం ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయ సమావేశమందిరంలో ఆత్మీయ వీడ్కోలు పలుకుతూ ఘనంగా సత్కరించారు. ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ పదవీవిరమణ పొందిన వారిని సత్కరించారు. పోలీస్ పీఆర్‌ఓ, ఎస్సై జి..కేశవరావు, డీఎస్‌బీ ఎస్సై ఎండీ మక్భూల్, ఏలూరు త్రీటౌన్ పోలీస్‌స్టేషన్ ఎస్సై జి.అజయ్‌కుమార్, ఏలూరు సీసీఎస్ ఎస్సై పి..సైమన్, ఏలూరు రూరల్ పోలీస్‌స్టేషన్ ఏఎస్సై పి.వీరాస్వామి, నిడమర్రు పోలీస్‌స్టేషన్ ఏఎస్సై డీయూఎస్ ప్రసాద్, ముదినేపల్లి పోలీస్‌స్టేషన్ ఏఎస్సై ఏ.శ్రీనివాసరావు తమ సర్వీసు కాలాన్ని పూర్తిచేసుకుని పదవీ విరమణ చేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ వై.ప్రసాదరావు, ఏఆర్ అదనపు ఎస్పీ జీ.మునిరాజా, ఆర్‌ఐ పవన్‌కుమార్, ఎస్‌బీ సీఐ మల్లేశ్వరరావు, సీసీఎస్ సీఐ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


