పెనుగొండ: దశాబ్ద కాలంగా పెనుగొండలో కోర్టు ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నా అడుగు ముందుకు పడడం లేదు. ఈ నేపథ్యంలో, స్థానికంగా కోర్టును పునరుద్ధరించాలనే డిమాండ్‌ను పరిసర ప్రాంతాల న్యాయవాదులు మరోసారి తెరపైకి తెచ్చారు. ఈ లక్ష్య సాధన కోసం ప్రత్యేకంగా సమావేశమైన లాయర్లు.. ఒక కార్యాచరణ కమిటీని కూడా ఏర్పాటు చేసుకున్నారు. జిల్లాలో బ్రిటిష్ పాలన కాలంలో, అంటే 1802వ సంవత్సరంలోనే ఏలూరు, నరసాపురంతో పాటు పెనుగొండలోనూ కోర్టును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నడుస్తున్న నాటి బ్రిటిష్ భవనంలోనే ఈ కోర్టు కొనసాగేది. ఈ భవనం వెనుక సబ్ జైలు కూడా ఉండేది. అప్పట్లో రూ.80 లోపు విలువైన తగాదాలను ఇక్కడ పరిష్కరించే వారని, దాదాపు 200 సంవత్సరాల పాటు ఈ కోర్టు సేవలందించిందని న్యాయవాదులు గుర్తు చేస్తున్నారు. అయితే స్వాతంత్య్రానంతరం కాలక్రమేణా సమీప పట్టణాలైన తణుకు, పాలకొల్లులలో కోర్టులను ఏర్పాటు చేస్తూ.. పెనుగొండను విస్మరించారు.
కక్షిదారులకు తప్పని తిప్పలు
ప్రస్తుతం పెనుగొండ జిల్లాలోనే అతిపెద్ద మేజర్ పంచాయతీగా ఉంది. దీనికి తోడు సమీపంలోని ఆచంట, పెనుమంట్ర, ఇరగవరం వంటి ప్రధాన మండలాల్లో సివిల్, క్రిమినల్ సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ ప్రాంతాలన్నీ తణుకు, పాలకొల్లు కోర్టుల పరిధిలోకి రావడంతో.. కక్షిదారులు, న్యాయవాదులు కేసుల నిమిత్తం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. అదే పెనుగొండలో కోర్టును ఏర్పాటు చేస్తే సమీప మండలాల ప్రజలందరికీ ఎంతో సౌకర్యంగా ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు.
ప్రతిపాదనల దశలోనే ఫైళ్లు
కోర్టు ఏర్పాటు ఆవశ్యకతపై గత దశాబ్ద కాలంగా పాలకులకు, అధికారులకు వినతులు అందుతూనే ఉన్నాయి. గతంలో ఒక దశలో కోర్టు మంజూరవుతుందనుకున్న తరుణంలో ప్రభుత్వాలు మారడంతో ఆ ప్రతిపాదనలు ఫైళ్లకే పరిమితమయ్యాయి. ప్రస్తుతం జిల్లాలో కొత్త కోర్టుల ఏర్పాటు జరుగుతుందనే ప్రచారం సాగుతుండడంతో, ఈ సారైనా పెనుగొండకు అవకాశం కల్పించాలని న్యాయవాదులు కోరుతున్నారు. ఈ మేరకు పాలకులు, అధికారులపై ఒత్తిడి తెచ్చి ఎలాగైనా కోర్టు సాధించుకోవాలనే పట్టుదలతో కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు.
ఏళ్లుగా ప్రతిపాదనలకే పరిమితమైన వైనం


