ఏలూరు (టూటౌన్): జిల్లాను పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చేసే దిశగా అడుగులు పడుతున్నాయని కలెక్టర్ కె.వెట్రిసెల్వి చెప్పారు. స్థానిక కలెక్టరేట్‌లోని గౌతమీ సమావేశపు హాలులో జిల్లా పారిశ్రామిక, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం మంగళవారం కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో రూ.280 కోట్లతో 5,200 ఎంఎస్‌ఎంఈ యూనిట్ల ఏర్పాటు లక్ష్యంగా నిర్ణయించామని, వీటి ఏర్పాటుద్వారా జిల్లాలోని 26 వేల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్‌ఎంఈ పార్క్ ఏర్పాటు పూర్తిచేయాలన్నారు. దెందులూరు, నూజివీడు నియోజకవర్గాల్లో ఎంఎస్‌ఎంఈ పార్క్ సంబంధించి భూసేకరణ పనులు త్వరితగతిన పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిలాల్లో కోకో సిటీ ఏర్పాటుపై పెట్టుబడిదారుల సదస్సు ఏర్పాటుచేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిలాల్లో 15 పరిశ్రమలకు పెట్టుబడి రాయితీ, వడ్డీ, విద్యుత్, రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ, తదితర రాయితీలుగా రూ.4.96 కోట్లు మంజూరు చేస్తూ సమావేశం తీర్మానించింది. జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఆర్.వెంకటరావు, డీఆర్డీఏ పీడీ విజయలక్ష్మి, పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ జోనల్ మేనేజర్ బాబ్జి, ట్రానో్‌ోస్క ఎస్‌ఈ బీఎం.అంబేద్కర్, వ్యవసాయ శాఖ అధికారి హబీబ్ బాషా, స్కిల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ జితేంద్ర, కార్మిక శాఖ సహాయ కమిషనర్ నాగేశ్వరరావు, మత్స్య శాఖాధికారి రాజ్‌కుమార్, గ్రౌండు వాటరు డీడీ కోదండరామ్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
కుక్కునూరు: స్థానిక అటవీ శాఖ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి మృతి పై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. కుక్కునూరు ఎస్సై రాజారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని రాజీవ్‌నగర్ గ్రామానికి చెందిన మేడి సత్యనారాయణ (55) గత 17 ఏళ్లుగా కుక్కునూరు అటవీ శాఖ కార్యాలయంలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం రాత్రి పెద్దపులి వేలేరుపాడు మండల అటవీ ప్రాంత సమీపంలోకి ప్రవేశించినట్లు సమాచారం రావడంతో సిబ్బంది అంతా అక్కడికి వెళ్లారు. దీంతో సత్యనారాయణ ఒక్కడే కార్యాలయంలో ఉన్నాడు. మంగళవారం ఉదయం కార్యాలయాన్ని శుభ్రం చేసేందుకు వచ్చిన స్వీపర్‌కు సత్యనారాయణ అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని గమనించి వెంటనే ఇతర సిబ్బందికి సమాచారం అందించింది. వారు సత్యనారాయణను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.


