కొయ్యలగూడెం: ఎలక్షన్ ప్రక్రియ నేపథ్యంలో ఓటర్ ఫారాల నమోదులో పాలకులకు అనుగుణంగా అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పేర్కొన్నారు. మంగళవారం పొంగుటూరు, చొప్పరామన్నగూడెం, గవరవరం గ్రామాల్లో శ్రీసర్‌శ్రీ కార్యక్రమం అమలుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బూత్ ఏజెంట్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్ సీపీకి అనుకూల ఓటర్ల ప్రాంతాల్లో ఇప్పటివరకు సర్వే ప్రక్రియ ప్రారంభించలేదన్నారు. అధికార పార్టీ నాయకులు ఇస్తున్న జాబితాకు అనుగుణంగానే బీఎల్వోలు, బీఎల్‌ఏలు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ‘సర్’ కార్యక్రమాన్ని గ్రామ స్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని, ప్రతి బూత్ కన్వీనర్ పార్టీ కార్యకలాపాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చురుగ్గా పనిచేయాలని సూచించారు. పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. జగన్ 2.0లో కార్యకర్తలకు తగిన ప్రాధాన్యత లభిస్తుందని, ప్రతి ఒక్కరు స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులను గెలిపించుకునే విధంగా కృషి చేయాలని కోరారు. చంద్రబాబు పాదం పెడితేనే కరువుకాటకాలు కవల పిల్లలుగా ప్రజలకు ఎదురవుతాయని ఎద్దేవా చేశారు. మండల రైతు విభాగం అధ్యక్షుడు గంటా రమేష్, మండల కో–కన్వీనర్ బిరుదుగడ్డల ప్రేమ్‌కుమార్, ఎంపీపీ గంజిమాల రామారావు, పొంగుటూరు, చొప్పరామన్నగూడెం, గవరవరం గ్రామాల కన్వీనర్లు గేలం వెంకటేశ్వరరావు, సతుల కిరణ్, పలివెల దుర్గారావు, పార్టీ నాయకులు పసుపులేటి రవీంద్ర, చీమకుర్తి సత్యనారాయణ, గేలం అప్పారావు, బొమ్మ రామకృష్ణ, ప్రగడ శివాజీ, చిరవూరి శ్రీను, ఎర్రమళ్ళ నాగు, పసుపులేటి కాశీరాం, దిరిసిపోము మధు, పలివెల సత్యనారాయణ, గేలం శ్రీను, గుండుమోలు మూర్తి రాజు తదితరులు పాల్గొన్నారు.


