కై కలూరు: ఆ ముచ్చటైన కుటుంబంపై విధి కన్నెర్రచేసింది. ముద్దుముద్దు మాటలు పలికే నాలుగేళ్ల కుమారుడిని చూసి మురిసిపోతున్న ఆ దంపతుల ఆనందం క్షణాల్లో ఆవిరైపోయింది. గర్భిణి అయిన భార్య, కంటిపాపలాంటి కొడుకు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘోర ప్రమాదం కై కలూరు మండలం పెంచికలమర్రు గ్రామంలో మంగళవారం విషాదఛాయలు నింపింది. గ్రామానికి చెందిన జయమంగళ విజయ్‌కుమార్, వెంకటరాజు అన్నదమ్ములు. జేసీబీ, పొక్లెయిన్ పనులు చేస్తూ వీరంతా ఒకే ఇంట్లో ఉంటున్నారు. వీరి తల్లి రమాదేవి అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మంగళవారం ఆమెను చూసేందుకు కుటుంబ సభ్యులంతా వెళ్లారు. తల్లికి తోడుగా ఉండేందుకు చిన్న తమ్ముడు వెంకటరాజు అతని భార్య లక్ష్మి అక్కడే ఉంచారు. తిరిగి విజయ్‌కుమార్, అతని భార్య భువనైక నాగదుర్గ (25), కుమారుడు కారుణ్య నాగసాయి (4), వెంకటరాజుతో కలిసి కారులో ఇంటికి బయలుదేరారు. వెంకటరాజు కారు నడుపుతున్నాడు. అయితే కృష్ణా జిల్లా గన్నవరం వెస్ట్ బైపాస్ రహదారి, బీబీగూడెం సమీపంలోకి రాగానే ఒక్కసారిగా ఓ గూడ్స్ కంటైనర్ లారీ టైర్ పగిలి, వీరి కారుపైకి దూసుకువచ్చింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన గర్భిణి నాగదుర్గ, ఆమె కుమారుడు నాగసాయి అక్కడికక్కడే మరణించారు. విజయ్‌కుమార్‌కు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు ప్రాణపాయం తప్పిందని వైద్యులు వెల్లడించారు. ఇటీవల పలు దేవాలయాలు సందర్శించి మొక్కులు తీర్చుకుని వచ్చిన ఆ కుటుంబంలో ఈ ఘోర విషాదం జరగడంతో స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు.
నరసాపురం: మద్యం మత్తులో ఉన్న వ్యక్తి వద్ద నుంచి బంగారు గొలుసు చోరీ చేసిన అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఆరుగట్లపాలెంకు చెందిన పాలెపు దుర్గాప్రసాద్‌ను మంగళవారం అరెస్ట్ చేసినట్టు టౌన్ సీఐ ఆకుల రఘు చెప్పారు. బాధితుడు చీదే ముత్యాలరావుకు ఈ నెల 28న నరసాపురం బస్టాండ్‌లో దుర్గాప్రసాద్ పరిచయమయ్యాడు. ఆ సమయంలో ముత్యాలరావు మద్యం మత్తులో ఉన్నాడు. కొంతసేపటికి ముత్యాలరావును వద్ద ఉన్న బంగారు గొలుసు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు విచారణ చేసి దుర్గాప్రసాద్‌నును అరెస్ట్ చేసి అతిని వద్ద నుంచి రూ 1.70 లక్షలు విలువైన బంగారు చైన్‌ను స్వాధీనం చేసుకున్నట్టు సీఐ చెప్పారు.


