ఎస్‌ఎన్‌సీయూలో వైద్యుల గైర్హాజరు | - | Sakshi
Sakshi News home page

ఎస్‌ఎన్‌సీయూలో వైద్యుల గైర్హాజరు

Jul 1 2026 1:40 AM | Updated on Jul 1 2026 1:40 AM

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం

నూజివీడు: స్థానిక ఏరియా ఆసుపత్రిలోని నవజాత శిశు విభాగం (ఎస్‌ఎన్‌సీయూ)లో వైద్యులు అందుబాటులో ఉండటం లేదు. అప్పుడే పుట్టిన పసిబిడ్డల నుంచి మూడు నెలల వయస్సు ఉన్న చిన్నారులకు అత్యవసర చికిత్స అందించేందుకు మే 23న రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ విభాగ నిర్వహణను ప్రభుత్వం థర్డ్‌ పార్టీకి అప్పగించగా వారు ఇద్దరు వైద్యులు, ఒక ల్యాబ్‌ టెక్నీషియన్‌, నర్సులు, సెక్యూరిటీ సిబ్బందిని నియమించారు. నిబంధనల ప్రకారం వైద్యులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇక్కడే ఉండి సేవలు అందించాల్సి ఉంది. అయితే నూజివీడు, హనుమాన్‌ జంక్షన్‌ ప్రాంతాలకు చెందిన ఈ ఇద్దరు వైద్యులకు సొంత క్లినిక్‌లు ఉండటంతో ప్రభుత్వ విధులను నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరు ప్రతిరోజూ ఆసుపత్రికి వచ్చి, కేవలం రిజిస్టర్‌లో సంతకాలు చేసి కొద్దిసేపటికే వెళ్లిపోతున్నారు. అత్యవసరంగా ఏదైనా కేసు వస్తే అక్కడి సిబ్బంది ఫోన్‌ చేసి పిలిచే వరకు కేంద్రానికి రావడం లేదు. వైద్యులు సకాలంలో అందుబాటులో లేక పసిప్రాణాలకు ముప్పు వాటిల్లితే ఎవరు బాధ్యత వహిస్తారని ఏరియా ఆసుపత్రి అభివృద్ధి సలహా సంఘం సభ్యులు ప్రశ్నిస్తున్నారు.

సిబ్బంది దురుసు ప్రవర్తన

మంగళవారం మధ్యాహ్నం ఈ కేంద్రాన్ని పరిశీలించగా ఇద్దరు వైద్యులూ విధుల్లో లేరు. దీనిపై అక్కడి సిబ్బందిని ప్రశ్నించగా కనీస సమాధానం చెప్పకుండా దురుసుగా ప్రవర్తించారు. ఎస్‌ఎన్‌సీయూ విభాగాన్ని ఫొటోలు తీస్తున్న క్రమంలో ల్యాబ్‌ టెక్నీషియన్‌ అది తన సొంత ఆసుపత్రి అన్నట్లుగా వ్యవహరిస్తూ ఫొటోలు తీయనివ్వకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించాడు.

సంతకాలు చేసి వెళ్లిపోతున్న వైనం

డ్యూటీ సమయంలో కచ్చితంగా ఎస్‌ఎన్‌సీయూలోనే ఉండాలని సదరు వైద్యులను ఇప్పటికే పలుమార్లు ఆదేశించాం. వారి నిర్లక్ష్య వైఖరిపై ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లాం.

డాక్టర్‌ పద్మజారాణి, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement