రోదిస్తున్నది | - | Sakshi
Sakshi News home page

రోదిస్తున్నది

Jun 30 2026 1:00 AM | Updated on Jun 30 2026 1:00 AM

రోదిస్తున్నది

కన్నెత్తి చూడని అధికారులు

ఆగని ఇసుక దందా

సాక్షి, భీమవరం : జిల్లాలోని ఆచంట నియోజకవర్గం నడిపూడిలో ఇసుకాసురులు పడ్డారు. సీఆర్‌జెడ్‌ నిబంధనలు తుంగలోకి తొక్కుతున్నారు. మీటర్లు లోతున వశిష్ట గోదావరి నదీ గర్భానికి తూట్లు పొడుస్తున్నారు. రాత్రంగా తవ్వకాలు చేస్తూ కోట్లాది రూపాయల ఇసుకను కొల్లగొడుతున్నారు. అక్రమార్కులకు ప్రభుత్వ పెద్దల అండదండలుండటంతో అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు.

సీఆర్‌జెడ్‌ నిబంధనలు మీరి..

వశిష్ట గోదావరి జిల్లాలో ప్రారంభమయ్యే పెనుగొండ మండలం సిద్ధాంతం నుంచి నరసాపురం రూరల్‌ బియ్యపుతిప్ప వద్ద సముద్రంలో కలిసే వరకు తీరం వెంబడి ఆరు ఓపెన్‌ రీచ్‌లు, ఐదు డీసిల్టేషన్‌ పాయింట్లు ద్వారా గతంలో ఇసుక తవ్వకాలు జరిగేవి. సముద్రపు పోటుతో ఆయా ర్యాంపుల్లోని ఇసుకలో ఉప్పునీటి సాంద్రత ఎక్కువై నిర్మాణ పనులకు అనుకూలంగా లేకపోవడటం, తీర ప్రాంత పరిరక్షణలో భాగంగా ఈ ప్రాంతాన్నంతటిని ప్రభుత్వం కోస్టల్‌ రెగ్యులేటరీ జోన్‌గా ప్రకటించడంతో రెండేళ్ల క్రితం ర్యాంపులు మూతపడ్డాయి. ఇక్కడ తవ్వకాలు చేసే వీలులేక జిల్లా అవసరాల కోసం తూర్పుగోదావరి జిల్లాలోని తీపర్రు, పెండ్యాల ర్యాంపులను కేటాయించింది. కూటమి వచ్చాక సీఆర్‌జెడ్‌ నిబంధలకు విరుద్ధంగా నడిపూడి, కరుగోరుమిల్లి తదితర చోట్ల అక్రమ తవ్వకాలు చేస్తున్నారు. స్థానికులు హైకోర్టును ఆశ్రయించగా తవ్వకాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం అధికారులను ఆదేశించింది.

రూ.కోట్లల్లో అక్రమార్జన

తూర్పుగోదావరి, డా.బీర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల్లోని పలు ర్యాంపుల్లో ఐదు యూనిట్ల లోడింగ్‌కు ప్రభుత్వ నిర్ణీత ధరతో పాటు అదనపు చార్జీల రూపంలో రూ.8 వేల వరకు చెల్లించాల్సి వస్తోంది. కాగా ఈ అనధికార ర్యాంపులో రూ.6 వేలకు ఇసుక లోడింగ్‌ చేస్తుండడంతో ఉభయ గోదావరి జిల్లాల నుంచి లారీలు ఇక్కడి క్యూ కడుతున్నాయని స్థానికులు అంటున్నారు. రోజూ రెండు వందలకు పైగా లారీలు లోడింగ్‌ చేస్తుండగా అక్రమార్జన రోజుకు రూ.12 లక్షల పైమాటేనని స్థానికులు అంటున్నారు. కొద్దిరోజులుగా సాగుతున్న తవ్వకాలతో కోట్లాది రూపాయల ఇసుకను కొల్లగొట్టారంటున్నారు. నిర్వహణ ఖర్చులు పోను మిగిలిన సొమ్ములు టీడీపీ అగ్రనాయకత్వానికి చేరుతున్నట్టు సమాచారం. మరోపక్క రానున్న వరదల సమయంలో సొమ్ములు చేసుకునేందుకు సిద్ధాంతం సమీపంలో అనుమతులు లేకుండా స్టాక్‌ పాయింట్‌ను ఏర్పాటుచేసి భారీ మొత్తంలో ఇసుకను డంప్‌ చేస్తున్నారు.

సొంత అవసరాల కోసం సామాన్యులు కొద్దిగా ఇసుక తెచ్చుకుంటే నిబంధనలు పేరిట హడావుడి చేసే అధికారులు సీఆర్‌జెడ్‌ పరిధిలో అక్రమ తవ్వకాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. హైవేను ఆనుకుని ఉన్న అనధికార స్టాక్‌ పాయింట్‌ అధికారులు దరిదాపుల్లోకి కూడా లేదంటున్నారు. కాగా స్థానికుల ఫిర్యాదులతో గ్రామ, మండల స్థాయిలోని ఉద్యోగులు ఎవరైనా తనిఖీలకు వెళితే.. ఎందుకు వెళ్లారంటూ ఉన్నతాధికారి ఒకరు వారిపై మండిపడుతున్నట్టు సమాచారం. దీంతో ఎవరూ అక్రమ తవ్వకాలు, అనధికార స్టాక్‌ పాయింట్‌ వైపు కన్నెత్తి చూసే సాహసం చేయడం లేదంటున్నారు. నడిపూడిలో తవ్వకాలు గురించి మైనింగ్‌ శాఖ ఏడీ మల్లేశ్వరరావును సంప్రదించగా నడిపూడిలో ఇసుక తవ్వకాలకు, స్టాక్‌ పాయింట్‌కు అనుమతి లేదన్నారు. తనిఖీలు చేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

తవ్వేయ్‌.. దోచేయ్‌

టీడీపీ నేతల బరితెగింపు

సీఆర్‌జెడ్‌ నిబంధనలు బేఖాతరు

నడిపూడిలో యథేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకాలు

పొక్లెయిన్లతో గోదావరి నదీ గర్భానికి తూట్లు

రూ.కోట్లల్లో అక్రమార్జన

కన్నెత్తి చూడని అధికారులు

తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక తవ్వకాలకు పేరొందిన టీడీపీ నేత కన్ను నడిపూడి ర్యాంపుపై పడింది. జట్టు కార్మికుల సమస్య లేకపోవడం, బాట అనుకూలంగా ఉండటంతో అక్రమ తవ్వకాలకు ఈ ర్యాంపును ఎంచుకున్నారు. సాధారణంగా తవ్వకాలు చేయాలంటే ఇరిగేషన్‌, మైనింగ్‌, పొల్యూషన్‌, రెవెన్యూ శాఖల అనుమతులు తప్పనిసరి. నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ) మార్గదర్శకాలను అనుసరించి తీరప్రాంతం కోతకు గురికాకుండా ఇసుక మేట వేసిన చోట పరిమిత అడుగుల లోతున జట్టు కార్మికులతో తవ్వకాలు చేయించాలి. పగటిపూట మాత్రమే తవ్వకాలు, లోడింగ్‌ చేయాలి. ఈ నిబంధనలకు తూట్లు పొడుస్తూ సదరు నేత చక్రం తిప్పారు. ప్రభుత్వ పెద్దల అండదండలతో నడిపూడి ర్యాంపులో అనధికార తవ్వకాలకు తెరలేపారు. పొక్లెయిన్లతో నదీ గర్భంలోంచి రెండు మూడు మీటర్ల లోతున ఇసుకను పైకితోడి తవ్వకాలు చేస్తున్నారు. రాత్రి మొదలు తెల్లవార్లూ అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయని స్థానికులు చెబుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement