తాడేపల్లిగూడెం రూరల్: తాడేపల్లిగూడెం జెడ్పీ హైస్కూల్‌లో సోమవారం ఎంఈవో–1 వి.హనుమపై డీవైఈఓ విచారణ నిర్వహించారు. ప్రధానంగా పాఠశాలలు సందర్శన సమయంలో సొమ్ముల డిమాండ్, మహిళలపై అసభ్య ప్రవర్తన వంటి అంశాలపై అభియోగాలు రావడంతో భీమవరం డీవైఈఓ ఎన్.రమేష్‌ను విచారణ అధికారిగా నియమించారు. ఆయన ఫిర్యాదుదారుల నుంచి విజ్ఞప్తులను స్వీకరించారు. విచారణ నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తానని చెప్పారు. కాగా హనుమ మాట్లాడుతూ తోటి ఉపాధ్యాయినులను సోదరసమానంగా చూస్తానని, ప్రభుత్వ ఆదేశాల మేరకు కొన్ని సందర్భాల్లో కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని, దానిని తప్పుగా భావించడం సరికాదని అన్నారు. పాఠశాల సందర్శన సమయంలో ఎటువంటి వసూళ్లకు పాల్పడలేదని, ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ సందర్భంగా ఆడిటర్‌కు సొమ్ములు చెల్లించాల్సి ఉంటుందని, ఆ మేరకు మాత్రమే చెల్లిస్తారని, తాను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని స్పష్టం చేశారు.


