● నేడే ఈఏపీ సెట్ ఫలితాలు
● ఇప్పటికే కొన్ని కళాశాలల్లో సీట్ల భర్తీ
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): విద్యార్థులు తమ కలల కోర్సుల్లో చేరే అవకాశం ఉందా లేదా అనేది మంగళవారంతో తేలిపోనుంది. ఇంటర్ పూర్తి చేసుకుని ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు రాసిన విద్యార్థుల నిరీక్షణకు నేటితో తెరపడనుంది. ఇటీవల నిర్వహించిన ఏపీ ఈఏపీ సెట్ పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదల చేయనున్నట్టు ఈఏపీ సెట్ కన్వీనర్ ప్రకటించడంతో విద్యార్థుల్లో ఉత్సాహం రెట్టింపైంది. తమ కలల కోర్సులైన ఇంజనీరింగ్, అగ్రికల్చరల్, ఫార్మసీ కోర్సుల్లో చేరడానికి ఈ ఫలితాలే ఆధారం కావడంతో వారు గత కొంతకాలంగా వేచి చూస్తున్నారు. అనుకున్న ర్యాంకులు వస్తే తాము కోరుకున్న కళాశాలల్లో సీటు సాధించవచ్చనే ఆశతో విద్యార్థులు ఉత్కంఠకు లోనవుతున్నారు. పరీక్షలు రాసిన వారిలో కొంతమంది జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించి ఇప్పటికే ఐఐటీల్లో ప్రవేశాలు పొందడంతో కొంత పోటీ తగ్గింది.
కంప్యూటర్ కోర్సులకు డిమాండ్
ఈఏపీ సెట్ ఫలితాలు వెలువడనుండటంతో జిల్లాలోని ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చరల్ కోర్సులు నిర్వహిస్తున్న కళాశాలల్లో సందడి వాతావరణం నెలకొంది. ఏలూరు నగరంలోని సీఆర్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాల, రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాల, ఏలూరు ఇంజనీరింగ్ కళాశాల, గోపన్నపాలెంలోని హేలాపురి ఇంజనీరింగ్ కళాశాలలు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సులు నిర్వహిస్తున్న మరో నాలుగు కళాశాలలు జిల్లా విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. అయితే అన్నింటికంటే ఎక్కువ డిమాండ్ ఉన్న ఇంజనీరింగ్ సీట్లపైనే ఆయా కళాశాలలు ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాయి. మంచి ర్యాంకులు సాధించిన వారికి పలు రాయితీలు ఇస్తామంటూ ఇప్పటికే నగరంలోని కొన్ని కళాశాలలు విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఊరిస్తున్నాయి.
గతేడాది కంటే ఫలితాలు ఆలస్యం
వాస్తవానికి ఈఏపీ సెట్ ఫలితాలు గత ఏడాది కంటే కొద్దిగా ఆలస్యమయ్యాయి. గత ఏడాది జూలై 1నే ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కాగా, ఈ ఏడాది జూన్ 30న ఫలితాలు విడుదల చేయడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో పాటు ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాల్లోనూ కొంత అసహనం వ్యక్తమైంది. ఫలితాలు ఆలస్యమైనప్పటికీ ప్రవేశాల ప్రక్రియను వేగంగా చేపట్టడానికి ఏపీ ఈఏపీ సెట్ ప్రతినిధులు కార్యాచరణ ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఫలితాలు విడుదలైన రెండు మూడు రోజుల్లోనే ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడనుంది. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే రిజిస్ట్రేషన్లు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రారంభం కానుంది.
ముందుగానే సీట్లు రిజర్వ్
ఇదిలా ఉండగా ఈఏపీ సెట్ ఫలితాలు వెలువడక ముందే కొన్ని ఇంజనీరింగ్ కళాశాలల్లో సీట్లు భర్తీ అయిపోయినట్టు తెలుస్తోంది. కన్వీనర్ కోటా సీట్లను కౌన్సిలింగ్ ద్వారానే భర్తీ చేసుకోవాల్సి ఉన్నప్పటికీ, యాజమాన్య కోటా సీట్లను కూడా ఫలితాలు వెలువడిన తర్వాతే భర్తీ చేయాల్సి ఉంటుంది. అయినప్పటికీ యాజమాన్యాలు ఇప్పటికే సీట్లను భర్తీ చేసుకుంటున్నాయి. సీఎస్‌ఈ, ఈసీఈ, ఏఐ, ఏఐఎంఎల్, ఏఐడీఎస్ సీట్లకు పోటీ నెలకొన్న నేపథ్యంలో, కళాశాలల ప్రతినిధులు విద్యార్థుల తల్లిదండ్రులను ఫోన్ల ద్వారా, వ్యక్తిగతంగా కలిసి సీట్లను రిజర్వ్ చేసుకోవాలని సూచిస్తూ ఒప్పిస్తున్నారు. ఫలితాల్లో మంచి ర్యాంకులు వస్తే వారు కట్టిన అడ్వాన్స్‌ను తిరిగి చెల్లించడానికి కూడా ఒప్పందం చేసుకుంటున్నారని సమాచారం. ర్యాంకు రాకపోతే కోరుకున్న బ్రాంచీల్లో సీట్లు దొరకవేమోనన్న అనుమానంతో కొంతమంది తల్లిదండ్రులు యాజమాన్యాల సూచన మేరకు సీట్లు రిజర్వ్ చేసుకుంటున్నారు. ఇలా మంచి కళాశాలలుగా పేరున్న సంస్థల్లో యాజమాన్య కోటా సీట్లు ఇప్పటికే 95 శాతం పైగా భర్తీ అయిపోయినట్టు ప్రచారం జరుగుతోంది.
ఏలూరు జిల్లాకు సంబంధించి మొత్తం 4 ఇంజనీరింగ్ కళాశాలలు ఉండగా, వాటిలో వివిధ బ్రాంచ్‌లకు సంబంధించిన 3,150 సీట్లు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. సీఆర్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో 1200 సీట్లు, రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాలలో 1020 సీట్లు, ఏలూరు ఇంజనీరింగ్ కళాశాలలో 600 సీట్లు, హేలాపురి ఇంజనీరింగ్ కళాశాలలో 330 సీట్లు ఉన్నాయి. ఇటీవల నిర్వహించిన ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలకు జిల్లాలోని 5598 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో 5290 మంది పరీక్షలు రాశారు,


