గాండ్రిస్తూ.. వలయాలను ఛేదిస్తూ.. | - | Sakshi
Sakshi News home page

గాండ్రిస్తూ.. వలయాలను ఛేదిస్తూ..

Jun 29 2026 1:59 AM | Updated on Jun 29 2026 1:59 AM

గాండ్రిస్తూ.. వలయాలను ఛేదిస్తూ.. 21 పశువులు హతం చిక్కకుండా.. దొరక్కుండా..

పెద్దపులి సంచారం సమయంలో దాడి చేసిన సంఘటనలో బుట్టాయగూడెం మండలంలో సుమారు 21 పశువులు బలైపోయాయి. పులి అటవీ ప్రాంతంలో సంచరించినా అక్కడి జంతువులను కాకుండా అటవీ ప్రాంత సమీపంలో కట్టేసి ఉన్న ఆవులపైనే దాడి చేసి చంపేసింది. పులి పర్యటనలో ఎక్కడా కూడా మనుషులపై దాడి చేసిన సంఘటనలు చోటుచేసుకోలేదు.

పెద్దపులిని పట్టుకునేందుకు అటవీ శాఖ ప్రత్యేక బృందాలు శ్రమించాయి. పులి కోసం పలు ప్రాంతాల్లో ప్రత్యేక వలయాలను ఏర్పాటుచేశారు. అయితే అధికారులు పన్నిన వలయాలను సైతం చాకచక్యంగా తప్పించుకుని అటవీ ప్రాంతంలో పులి గ్రామాల్లో యథేచ్ఛగా సంచరించింది. పులిని బంధించేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు పలుమార్లు విఫలమయ్యాయి. ప్రస్తుతం ఆంధ్రా నుంచి తెలంగాణ వైపు వెళ్లడంతో ఇక్కడ అధికారులకు ఉపశమనం లభించింది.

బుట్టాయగూడెం మండలం నాగులగూడెంలో తొలిసారి కెమెరాకు చిక్కిన పెద్దపులి (ఫైల్‌)

బుట్టాయగూడెం: రాష్ట్రంలోని ఏలూరు, పోలవరం, తూర్పుగోదావరి జిల్లాల్లోని ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన పెద్దపులి కదలికలు ముగిశాయి. ఆ పులి ప్రస్తుతం రాష్ట్ర సరిహద్దు దాటి తెలంగాణ వైపు వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. అలాగే పెద్దపులికి అమర్చిన రేడియో కాలర్‌ ద్వారా తెలంగాణ ప్రాంతంలో ప్రవేశించినట్టు గుర్తించిన ఏపీ అటవీ శాఖ అధికారులు అక్కడి అధికారులను అప్రమత్తం చేశారు. అయితే పులి ప్రస్తుతం ఆంధ్రా, తెలంగాణ సరిహద్దుల్లోనే ఉండటంతో రెండు రాష్ట్రాల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్టు అధికారులు చెప్పారు. ఆదివారం ఉదయంతో జిల్లాలో పులి సంచారం ముగియడంతో అటవీశాఖ అధికారులకు ఊరట లభించింది. దీనితో ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

ఎక్కడ మొదలైందో అక్కడికే..

సుమారు ఆరు నెలలపాటు గోదావరి జిల్లాల ప్రజలను భయాందోళనకు గురి చేసిన పెద్దపులి ఈ ఏడాది జనవరి 22న తెలంగాణలోని అశ్వారావుపేట మండలం కావిడిగుండ్ల నుంచి ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలంలోకి ప్రవేశించింది. పందిరిమామిడిగూడెం–గుబ్బల మంగమ్మ గుడి మార్గంలో తిరుగుతూ ప్రజలను హడలెత్తించింది. అదేరోజు అంతర్వేదిగూడెం సమీపంలో ఆవు, లేగదూడలపై పంజా విసిరి హతమార్చింది. అయితే పులి ఆచూకీ కోసం అటవీశాఖ అధికారులు ట్రాప్‌ కెమెరాలు ఏర్పాటు చేయగా నాగులగూడెం సమీపంలో మొదటిసారిగా పెద్దపులి కెమెరాకు చిక్కింది. అప్పటినుంచి బుట్టాయగూడెం మండలంలో సుమారు 13 పశువులను హతమార్చి జనవరి 31న పోలవరం–పట్టిసీమ పరిసర ప్రాంతాల్లో సంచరించి గోదావరి ఈదుకుంటూ తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. ఆ పరిసర ప్రాంతాల్లో సంచరించి ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న సమయంలో పూనె నుంచి వచ్చిన రెస్క్యూటీమ్‌ రాయవరం మండలం కూర్మాపురంలో గన్‌ ద్వారా మత్తు ఇంజెక్షన్‌ ఇచ్చి పెద్దపులిని బంధించారు. కొద్దిరోజుల తర్వాత మళ్లీకి రేడియో కాలర్‌ అమర్చి ఆ పులిని పాపికొండల అభయారణ్యంలో విడిచిపెట్టారు. మళ్లీ పులి తన సంచారాన్ని ప్రారంభించి పోలవరం జిల్లాలో పలు చోట్ల సంచరిస్తూ ఈనెల 23న ఏలూరు జిల్లాలోకి ప్రవేశించింది. పలు గ్రామాల్లో సంచరిస్తూ పశువులపై దాడి చేస్తూ ఆదివారం వేకువజామున బుట్టాయగూడెం మండలం గుబ్బల మంగమ్మగుడి అటవీ ప్రాంతం నుంచి తెలంగాణలోని కంట్లం వైపు వెళ్లినట్టు అటవీ అధికారులు నిర్ధారించారు.

తెలంగాణకు పెద్దపులి పయనం

సుమారు ఆరు నెలలపాటు గోదావరి జిల్లాల్లో తిష్ట

ప్రజలను, అధికారులను హడలెత్తించిన బెబ్బులి

ఎట్టకేలకు వచ్చిన మార్గంలోనే తిరుగు ప్రయాణం

పులి దాడిలో దాదాపు 21 పశువులు హతం

జిల్లావాసులకు ఉపశమనం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement