ఏలూరు (టూ టౌన్) : చర్చిలు కూల్చిన చోటే నీ సమాధి కడతాం.. అంటూ డిప్యూటీ స్పీకర్ రఘు రామకృష్ణంరాజును ప్రముఖ న్యాయవాది, జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్‌కుమార్ హె చ్చరించారు. దళిత క్రైస్తవ సమర శంఖారావం పేరిట ఏలూరులో నిర్వహించిన సభలో శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ ఆకివీడు, భీమవరంలో జరిగిన ఘటనలు దళిత క్రైస్తవుల ఆత్మగౌరవానికి భంగం కలిగించాయన్నారు. రఘురామకృష్ణంరాజునుద్దేశించి మాట్లాడుతూ ‘దళిత క్రైస్తవులపై నువ్వు యుద్ధం ప్రకటించావు.. ముగింపు నేనే ఇస్తా’.. అంటూ హెచ్చరించారు. ఆర్టికల్ 25 ప్రకారం ఈ దేశ ప్రజలకు ఎవరికి నచ్చిన మతాన్ని వారు అనుసరించే హక్కు ఉందని, దళిత క్రైస్తవుల హక్కులను కాలరాసే అధికారం ఎవరికీ లేదన్నారు. మతాలను ద్వేషించి కులాల మధ్య చిచ్చు పెట్టడం సరికాదని హితవు పలికారు. వచ్చే ఎన్నికల్లో రఘురామకృష్ణంరాజు రాష్ట్రంలో ఎక్కడి నుంచి పోటీ చేసినా ఓడించి తీరుతామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కోటీ పది లక్షల మంది దళిత క్రైస్తవులున్నారని, వచ్చే ఎన్నికల్లో వీరిలో 10 లక్షల మంది తన వెంట ఉంటే రాజకీయం ఎలా ఉంటుందో చూపిస్తానన్నారు. పదో తరగతి చదివిన పవన్‌కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాగా లేనిది, న్యాయశాస్త్రం చదివిన తాను డిప్యూటీ సీఎం కావాలనుకోవడంలో తప్పు లేదుగా అని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలు, పెద్ద సంఖ్యలో దళిత క్రైస్తవులు పాల్గొన్నారు.
జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్‌కుమార్ హెచ్చరిక
ఏలూరులో దళిత క్రైస్తవ సమర శంఖారావం


