ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని ఆదివారం రాత్రి సీఎంఓ కార్యదర్శి కార్తికేయ మిశ్రా, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(ఐఎఫ్‌ఎస్) అధికారి ఆర్‌పీ కజూరియా, జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి సందర్శించారు. ముందుగా ఆలయానికి విచ్చేసిన వారికి దేవస్థానం ఈఓ వేండ్ర త్రినాథరావు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో అర్చకులు, పండితులు అధికారులకు శ్రీవారి శేష వస్త్రాలను కప్పి, వేద ఆశీర్వచనాన్ని పలుకగా, ఈఓ త్రినాథరావు చినవెంకన్న చిత్రపటాలను, ప్రసాదాలను అందజేశారు.
చింతలపూడి: చింతలపూడి మండలం ఊటసముద్రం గ్రామంలో ఒక కుటుంబాన్ని వెలివేసినట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు కేవలం వదంతులేనని, వాటిని ఎవరూ నమ్మవద్దని చింతలపూడి సబ్–ఇన్‌స్పెక్టర్ కె.సతీష్ కుమార్ స్పష్టం చేశారు. గ్రామంలో ఇటీవల జరిగిన వివాహం విషయంలో తలెత్తిన వివాదంపై పోలీసులకు ఫిర్యాదు అందిందని, తాము విచారించగా వెలివేత జరగలేదని తేలిందని తెలిపారు. గ్రామానికి చెందిన ఒక ఆకతాయి సృష్టించిన ఆడియో క్లిప్పింగ్ వల్ల ఈ పుకార్లు వ్యాపించాయని వివరించారు. ఇరువర్గాలకు కౌన్సెలింగ్ నిర్వహించామని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


