నూజివీడు: రాష్ట్రంలోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) పరిధిలో నిర్వహిస్తున్న నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీల్లో సీట్ల భర్తీకి నిర్వహించిన కౌన్సెలింగ్ అనంతరం 627 సీట్లు మిగిలిపోయాయి. ఈ నెల 19న ప్రారంభమైన కౌన్సెలింగ్ ప్రక్రియ ఈ నెల 24తో ముగిసింది. మిగిలిన సీట్ల భర్తీకి రెండో విడత కౌన్సెలింగ్‌ను జూలై తొలి వారంలో నిర్వహించేందుకు ఆర్జీయూకేటీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. మొదటి విడత కౌన్సెలింగ్ పూర్తయిన అనంతరం పరిశీలిస్తే నాలుగు ట్రిపుల్ ఐటీల్లో కలిపి 627 సీట్లు మిగలడం గమనర్హం. గతేడాది 598 సీట్లు మిగలగా ఈ ఏడాది అంతకంటే ఎక్కువ సీట్లు మిగలడంపై ట్రిపుల్ ఐటీ వర్గాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ప్రత్యేక కేటగిరీ సీట్లు మినహాయిస్తే నాలుగు ట్రిపుల్ ఐటీలలో కలిపి 4,040 సీట్లకు అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఎంపిక చేసిన వారిలోనే 627 మంది ట్రిపుల్ ఐటీలో చేరడానికి నిరాసక్తత చూపడం గమనార్హం. ఎంపికై న అభ్యర్థుల్లో 15.5 శాతం మంది ట్రిపుల్ ఐటీల్లో చేరేందుకు ఇష్టపడలేదు. ఒక్కో ట్రిపుల్ ఐటీలో 1,010 సీట్లకు గాను కౌన్సెలింగ్ నిర్వహించగా నూజివీడు ట్రిపుల్ ఐటీలో 129 సీట్లు, ఇడుపులపాయలో 171 సీట్లు, శ్రీకాకుళంలో 139 సీట్లు, ఒంగోలు ట్రిపుల్ ఐటీలో అత్యధికంగా 188 చొప్పున సీట్లు మిగలడం గమనార్హం. మిగిలిన సీట్లను భర్తీ చేసేందుకు రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. కౌన్సెలింగ్ ప్రక్రియ ముందుగా నిర్వహించి పూర్తిచేసినప్పటికీ ఇంత పెద్ద ఎత్తున సీట్లు భర్తీ కాకుండా ఉండటం ట్రిపుల్ ఐటీ వర్గాల్లో విస్మయాన్ని కలిగిస్తోంది.
కారణాలేంటి?
రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీల్లో తొలి విడత కౌన్సెలింగ్ అనంతరం 627 సీట్లు మిగలడానికి కారణమేంటనేది ట్రిపుల్ ఐటీ వర్గాల్లో అంతుబట్టడం లేదు. పూర్తి రెసిడెన్షియల్ విధానంలో విద్యాబోధన నిర్వహిస్తున్న ప్రభుత్వ రంగ విద్యాసంస్థలో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపకపోవడం ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. నూజివీడు ట్రిపుల్ ఐటీలోనే తక్కువ సీట్లు మిగలగా మిగిలిన అన్నింటిలో అంతకంటే ఎక్కువ సీట్లు మిగిలాయి. ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు సరైన సదుపాయాలు లేనందున విద్యార్థులు చేరేందుకు ఆసక్తి చూపి ఉండకపోవచ్చేమో. అన్ని వసతులున్న ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో కూడా 174 సీట్లు మిగలడం విశేషం. దరఖాస్తు చేసుకున్న వారిలో 80 శాతం మందికి పైగా మొదటి ప్రాధాన్యతగా నూజివీడు ట్రిపుల్ ఐటీని ఎంపిక చేసుకున్నారు. దీంతో అందరికి నూజివీడు ట్రిపుల్ ఐటీలో సీటు రాదు కాబట్టి ఇతర ట్రిపుల్ ఐటీల్లో చేరేందుకు ఆసక్తి చూపించి ఉండకపోవచ్చంటున్నారు. కేవలం ఒక్క నూజివీడులోనే పర్మినెంట్ ఫ్యాకల్టీ ఉండటం, మిగిలిన చోట్ల అంతా కాంట్రాక్టు ఫ్యాకల్టీ, గెస్ట్ లెక్చరర్లతోనే విద్యాబోధన నిర్వహించడం, ఒంగోలు ట్రిపుల్ ఐటీ పియూసీ తరగతులు ఇడుపులపాయలోనూ, శ్రీకాకుళం పీయూసీ తరగతులు నూజివీడు ట్రిపుల్‌ఐటీలో నిర్వహిస్తుండటం కూడా కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. వీటన్నింటికీ తోడు ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు ఇంకా పర్మినెంట్ వసతులు రాకపోవడం కారణాలుగా కనిపిస్తున్నాయి.
చేరిన వారిలో బాలికలే ఎక్కువ
నాలుగు ట్రిపుల్ ఐటీల్లో కలిపి చేరిన విద్యార్థుల్లో బాలికలే ఎక్కువగా ఉన్నారు. మొత్తం 3,413 మంది విద్యార్థులు నాలుగు ట్రిపుల్ ఐటీల్లో చేరగా వీరిలో బాలికలు 2,439 మంది ఉండగా, బాలురు 974 మంది మాత్రమే ఉన్నారు. దీంతో మూడొంతుల్లో రెండు వంతులు మంది బాలికలే ఉండటం గమనార్హం.
నాలుగింటిలో కలిపి భర్తీకాని 627 సీట్లు


