కొల్లేరులో కోడిపందేలపై దాడి | - | Sakshi
Sakshi News home page

కొల్లేరులో కోడిపందేలపై దాడి

Jun 29 2026 1:47 AM | Updated on Jun 29 2026 1:47 AM

కొల్లేరులో కోడిపందేలపై దాడి యథాతథంగా గుబ్బల మంగమ్మ తల్లి దర్శనం కళలను ప్రోత్సహించడం శుభపరిణామం గ్యాస్‌ బుక్‌ చేస్తే ఇవ్వడం లేదు అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

దెందులూరు: కొల్లేరులోని కోడి పందేల స్థావరాలపై ఏలూరు రూరల్‌ ఎస్సై వి.వెంకటేశ్వరరావు తన సిబ్బందితో కలిసి దాడి చేశారు. వారి నుంచి రూ.6,250 నగదు, రెండు కోడిపుంజులను స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తే సహించేది లేదని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి అసాంఘిక శక్తుల భరతం పడతామని హెచ్చరించారు.

బుట్టాయగూడెం: గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తొలుత పెద్దపులి సంచారం నేపథ్యంలో ఆలయ కమిటీ వారు దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. కామవరం సమీపంలోని గేటు, రామచంద్రాపురంలో ఉన్న గేట్లకు తాళం వేసి భక్తులను ఆలయానికి వెళ్లకుండా ఆపారు. పెద్దపులి మంగమ్మ గుడి సమీపం నుంచి కంట్లం వైపు సుమారు రెండున్నర కిలోమీటర్లు వెళ్లిందని గుర్తించిన అధికారులు, భక్తులకు దర్శనానికి అనుమతులు ఇచ్చారు. వర్షం, కారుమబ్బులు ఉన్నప్పటికీ భక్తులు వెనుకాడకుండా మంగమ్మ తల్లిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

పాలకొల్లు సెంట్రల్‌: కళలను, కళాకారులను ప్రోత్సహించడంలో పాలకొల్లుది అగ్రస్థానమని ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్‌ అన్నారు. ఆదివారం స్థానిక లయన్స్‌ కమ్యూనిటీ హాలులో అల్లూరి సీతారామరాజు జాతీయ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందిన మొదటి బ్యాచ్‌ విద్యార్థులకు సర్టిఫికెట్ల ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రవీంద్రనాథ్‌ మాట్లాడుతూ, ఇలాంటి వేదికలు కళాకారుల ప్రతిభను వెలికితీసేందుకు దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య, సినీ నటి కె.దివ్యవాణి, దర్శకులు కళ్యాణకృష్ణ కె, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, రాజా వన్నెంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కాళ్ల: గ్యాస్‌ బుక్‌ చేసినా నెలల తరబడి ఇవ్వడం లేదని, అడిగితే కంపెనీ సిబ్బంది పొంతనలేని సమాధానాలు చెబుతున్నారని పల్లెపాలెం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం గ్రామస్తులు నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, మే నెలలో బుక్‌ చేసినా ఇంతవరకు గ్యాస్‌ అందలేదని ఆరోపించారు. బుకింగ్‌ క్యాన్సిల్‌ అయ్యిందని, ఏజెన్సీ వారు వాడుకున్నారని సిబ్బంది చెబుతున్నారని, దీనిపై అధికారులు స్పందించి డోర్‌ డెలివరీ జరిగేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ తిరుమాని మార్రాజు, బస్వాని వడ్డికాసులు, తిరుమల శెట్టి బాలాజీ, మోహన్‌ రావు పాల్గొన్నారు.

నరసాపురం రూరల్‌: మొగల్తూరు మండలం పాలకమ్మ చెరువు గ్రామంలో ఆక్వా చెరువుపై పనిచేసే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పాలకమ్మచెరువు గ్రామంలోని పెనుమత్స హరిరాజుకు చెందిన ఆక్వా చెరువుపై కాట్రేనికోన మండలం కందికుప్ప గ్రామానికి చెందిన నక్కా దీనబాబు (48) కొంతకాలంగా పనిచేస్తున్నాడు. ఆదివారం ఉదయం చెరువు సమీపంలో ఉన్న బోదెలో పడి మృతి చెందినట్లు ఎస్సై జయలక్ష్మి తెలిపారు. మృతుడి మరణానికి సంబంధించి కారణాలు తెలియాల్సి ఉంది. మృతుడి బావ భీమరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement