బుట్టాయగూడెం: మండలంలోని సీతప్పగూడెం గ్రామ పంచాయతీకి ఏర్పాటు చేసిన స్మార్ట్ మీటర్ అదివారం పంచాయతీ అధికారులను, సిబ్బందిని హైరానాకు గురి చేసింది. గ్రామాల్లో మంచి నీటిని విడుదల చేయడం కోసం నీటిని విడుదల చేసే వ్యక్తి ఉదయం పంచాయతీ మోటరు ఆన్ చేయగా.. అది పని మొరాయించింది. మోటర్ కాలిపోయి ఉంటుందని భావించి ఆ వ్యక్తి పంచాయతీ కార్యదర్శికి మోటర్ పని చేయని విషయాన్ని తెలిపాడు. హుటాహుటిన అక్కడకు వచ్చిన కార్యదర్శి మోటర్ ఆన్ చేసే ప్రయత్నం చేశారు. విద్యుత్ మీటర్‌లో కరెంటు ఉన్నట్లు కనిపిస్తుంది కానీ మోటర్ తిగడం లేదు. ఏం జరిగిందో తెలియక కార్యదర్శి, సిబ్బంది ఆందోళనకు చెందారు. మోటర్ పని చేయకపోవడాన్ని కార్యదర్శి విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఆ సమయంలో వారు గ్రామ పంచాయతీలకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు చేశామని, అది ప్రీపెయిడ్ మీటర్ అని తెలిపాడు. వచ్చే నెల నుంచి మీటర్లకు ప్రీపెయిడ్ విధానంలో డబ్బులు కడితేనే అవి పని చేస్తాయని చెప్పాడు. సీతప్పగూడెం పంచాయతీ సంఘటనతో మిగిలిన పంచాయతీ కార్యదర్శులు ఆందోళన చెందుతున్నారు. బుట్టాయగూడెం మండలంలో 21 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అన్ని పంచాయతీలకు స్మార్ట్ మీటర్లు అమర్చినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం స్మార్ట్ మీటర్లు ప్రీపెయిడ్ పద్ధతి కావడంతో ఎప్పుడు ఆగిపోతాయో అని కార్యదర్శులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. 21 పంచాయతీల్లో 136 గ్రామాల్లోని ప్రజలు నీటి కోసం ప్రజలు ఎదురుచూస్తూ ఉంటారు. ఎప్పుడుపడితే అప్పుడు డబ్బులు చెల్లించడానికి అవకాశం ఉండదని అంటున్నారు. ప్రీపెయిడ్ పద్ధతి విధానంలో బాలెన్స్ అయిపోగానే విద్యుత్ సరఫరా ఆటోమేటిక్‌గా నిలిచిపోయే అవకాశం ఉన్నందున అత్యవసర సమయాల్లో గ్రామ పంచాయతీ సేవలు, వీధి దీపాలు నీటి సరఫరా వంటి సేవలకు తీవ్ర ఆటంకం కలిగే అవకాశం ఉందని అధికారులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.
డబ్బులు కడితేనే పనిచేస్తాయంటున్న అధికారులు


