● స్నానానికి దిగి యువకుడు మృతి
● మరో విద్యార్థి గల్లంతు
నరసాపురం రూరల్: మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్‌లో ఆదివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సముద్ర స్నానానికి దిగి ప్రమాదవశాత్తు ఒక యువకుడు ప్రాణాలు కోల్పోగా, మరో పాలిటెక్నిక్ విద్యార్థి అలల తాకిడికి కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షనన్‌కు చెందిన జిజ్జువరపు ఉమామహేశ్వరరావు (26) తన స్నేహితులతో కలిసి ఆదివారం సరదాగా గడిపేందుకు పేరుపాలెం బీచ్‌కు వచ్చాడు. అందరూ కలిసి సముద్రంలో స్నానానికి దిగగా, ప్రమాదవశాత్తు ఉమామహేశ్వరరావు మృతి చెందాడు. మృతుడి తండ్రి ప్రసాద్ ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బీచ్‌లో దొరికిన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇదే బీచ్‌లో జరిగిన మరో ప్రమాదంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మురమళ్ళ గ్రామానికి చెందిన సీహెచ్ సుభాష్ గల్లంతయ్యాడు. రాజమండ్రిలోని పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్న ఈ యువకుడు, స్నానానికి దిగి అలల ఉధృతికి కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న సీఐ నాగరాజు, మొగల్తూరు ఎస్సై పోలీసులు సిబ్బంది స్థానిక మత్స్యకారులతో కలిసి గల్లంతైన సుభాష్ కోసం సముద్రంలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. పేరుపాలెం బీచ్‌లో ఇలాంటి ప్రాణాంతక ఘటనలు తరచూ చోటుచేసుకుంటూనే ఉన్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు నేతలు, అధికారులు ఈ బీచ్‌ను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా, గోల్ఫ్ కోర్స్‌గా అభివృద్ధి చేస్తామని గొప్పలు చెబుతున్నా.. కనీస రక్షణ చర్యలు కరువయ్యాయని పలువురు విమర్శిస్తున్నారు. బీచ్‌లో తరచూ మరణాలు ఎందుకు జరుగుతున్నాయో అధికారులు ముందుగా క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, పర్యాటకుల భద్రత కోసం హెచ్చరిక బోర్డులు, లైఫ్ గార్డులను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. బీచ్ పరిసరాల్లో మద్యం అమ్మకాలను పూర్తిస్థాయిలో నిరోధించడానికి కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


