వేధింపుల వల్లే ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

వేధింపుల వల్లే ఆత్మహత్యాయత్నం

Jun 29 2026 1:47 AM | Updated on Jun 29 2026 1:47 AM

జంగారెడ్డిగూడెం/టి.నరసాపురం: భర్త తరపు బంధువులు, మరికొందరి వేధింపులు భరించలేకే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ఉండి మండలం పాందువ్వ గ్రామానికి చెందిన వీధి నవీన్‌ కుమార్‌ భార్య రజిత ఆరోపించారు. ప్రస్తుతం ఆమె జంగారెడ్డిగూడెంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రిలో కోలుకుంటున్న రజిత తన ఆత్మహత్యాయత్నానికి గల కారణాలను పోలీసులకు వెల్లడించింది. పెళ్లయిన నాటి నుంచి అదనపు కట్నం కోసం భర్త తల్లి వీధి బుజ్జి, భర్త మేనమామ మాదాసి రవికుమార్‌, కుటుంబ సభ్యులు వేధించేవారని చెప్పారు. పెళ్ళి సమయంలో రూ.5 లక్షలు కట్నం ఇచ్చారని, అయినా కట్నం సరిపోలేదని వేధిస్తున్నారన్నారు. భర్తకు మోటార్‌ సైకిల్‌ కోసం వేధిస్తుండటంతో, పుట్టింటి వారి సహాయంతో నగదు సమకూర్చినప్పటికీ వేధింపులు ఆగలేదన్నారు. నవీన్‌కుమార్‌ వ్యవసనాలకు బానిసయ్యాడని, ఈ క్రమంలో గత మే 12న కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆత్మహత్య చేసుకుని మృతిచెందాడని ఆమె పోలీసులకు తెలిసిన స్టేట్‌మెంట్‌లో తెలిపారు. భర్త మరణానికి రజితనే కారణమంటూ అంత్యక్రియల సమయంలో, ఆ తర్వాత కూడా బంధువులు అవహేళన చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నవీన్‌ చావుకు కారణం నువ్వేనంటూ రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారని, లేనిపక్షంలో పోలీసు కేసులు పెడతామని భయపెట్టారని ఆరోపించారు. తీవ్ర మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించినట్లు ఆమె తెలిపింది. రజిత వాంగ్మూలం ఆధారంగా టి.నరసాపురం ఎస్సై ఎం.జయబాబు ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement