నెలనెలా కోత
వేలల్లో దరఖాస్తులు
సాక్షి, భీమవరం: పేద వర్గాలకు ఆర్ధిక భరోసానిచ్చే సామాజిక పింఛన్ల మంజూరును కూటమి సర్కారు విస్మరించింది. రెండేళ్ల పాలనలో కొత్త పింఛన్ ఒక్కటీ ఇవ్వలేదు. దరఖాస్తుల ఆన్‌లైన్‌్ సైట్‌ను ఆఫ్‌లోనే ఉంచి వేల దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టేసింది. 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వద్ధాప్య పింఛన్ ఇస్తామన్న ఎన్నికల హామీ ఊసే ఎత్తడం లేదు.
గత ప్రభుత్వం ఏటా జనవరి, జూలై నెలల్లో కొత్త పింఛన్లు మంజూరు చేసేవారు. చివరిగా 2024 జనవరిలో జిల్లాలో 4,274 కొత్త పింఛన్లు అందజేశారు. జూలైలో కొత్త మంజూరు రావాల్సి ఉంది. జూన్‌లో కూటమి ప్రభుత్వం వచ్చాక కొత్త పింఛన్ల మంజూరు నిలిపివేసింది. అందుకు సంబంధించిన వెబ్‌సైట్‌ను క్లోజ్ చేయడంతో పాటు దరఖాస్తుల ఆన్‌లైన్ ప్రక్రియను నెలల తరబడి నిలిపివేసింది. పింఛన్ల కోసం పేదలు సచివాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండగా ప్రభుత్వం నుంచి తమకు ఇంకా మార్గదర్శకాలు ఏమీ రాలేదని ఉద్యోగులు వారిని వెనక్కి పంపిస్తున్నారు.
స్పౌజ్‌తో సరి :
పేదవర్గాల్లో కుటుంబ యజమాని మృతిచెందితే భార్యకు ఆసరాగా తర్వాతి నెల నుంచి వితంతు పింఛన్ మంజూరు చేయడం పరిపాటి. గత ప్రభుత్వంలో ఎప్పటికప్పుడు స్పౌజ్ పింఛన్లు మంజూరు చేసేవారు. జిల్లాలో పింఛన్ తీసుకుంటూ దాదాపు నాలుగు వేల మంది లబ్ధిదారులు మృతిచెందగా వారి భార్యలకు మాత్రమే ఇటీవల కూటమి ప్రభుత్వం స్పౌజ్ కోటాలో పింఛన్లు అందజేసింది. వీటినే కొత్త పింఛన్లు మంజూరుచేసినట్టుగా కూటమి నేతలు హడావుడి చేయడం గమనార్హం. భర్తను కోల్పోయిన నిరుపేద మహిళలు ఎంతోమంది వితంతు పింఛన్ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. వారి ఆవేదనను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
హామీ అమలేది :
50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వృద్ధాప్య పింఛన్ అందజేస్తామని ఎన్నికల్లో చంద్రబాబు, కూటమి నేతలు ఊరూవాడ ఊదరగొట్టారు. జిల్లాలో 50 ఏళ్ల నుంచి 60 ఏళ్ల పింఛనన్‌కు అర్హత కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు రెండు లక్షల వరకు ఉంటారని అంచనా. కూటమి ప్రభుత్వం వచ్చి మూడో ఏడాదిలో అడుగుపెట్టినా ఎన్నికల హామీ అమలు దిశగా అడుగులు వేయకపోవడం ఆయా వర్గాల వారిని తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.
కూటమి ప్రభుత్వం మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయినా ఇంత వరకూ కొత్త పెన్షన్లపై నిర్ణయం తీసుకోకపోవడం శోచనీయం. దీనివల్ల మాలాంటి వృద్ధులు పెన్షన్ అందక ఇబ్బంది పడుతున్నాం. వెంటనే కొత్త పెన్షన్ల అందించాలి.
– బాలం నాగేశ్వరరావు, పెనుమర్రు
ఎన్నికల వాగ్దానంలో సూపర్ సిక్స్ అని ప్రజలను నమ్మించి గొంతు కోశారు. రెండేళ్లు గడిచినా కొత్త పింఛన్‌ల ఊసేలేదు. బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ అన్నారు. అతీగతీ లేదు. వెరిఫికేషన్ పేరుతో దివ్యాంగుల పింఛన్లను తొలగిస్తున్నారు. గత ప్రభుత్వంలో నిరంతరం పింఛన్లు ఇస్తే, కూటమి ప్రభుత్వం ఇంతవరకూ కొత్త పింఛన్లు ఇవ్వలేదు.
– పాలా రాధాకృష్ణ, గరగపర్రు
రెండేళ్లలో కొత్తగా ఒక్కటీ మంజూరు చేయని వైనం
కూటమి వచ్చే నాటికి జిల్లాలో 2,32,885 పింఛన్లు
జూన్ నాటికి 2,21,843కు తగ్గిన పింఛన్లు
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్ హామీ గాలికి
కూటమి ప్రభుత్వం కొత్త పింఛన్లు ఇవ్వకపోగా ఖజానాపై భారం పడకుండా ఉన్నవాటికి కోత పెడుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2024 జూన్ నాటికి జిల్లాలో పింఛన్ లబ్ధిదారులు 2,32,885 మంది ఉండగా ఈ ఏడాది జూనన్ నాటికి వారి సంఖ్య 2,21,843కు తగ్గాయి. ఈ మేరకు ప్రతి నెల వారికి అందించే సాయం తగ్గుతోందంటున్నారు. రెండేళ్ల కాలంలో జిల్లాలో 11,042 పింఛన్లు తగ్గిపోగా సుమారు రూ.23 కోట్లకు పైనే భారం తగ్గించుకుంది.
వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ తదితర పింఛన్లు కోరుతూ ప్రతి సోమవారం జరిగే పీజీఆర్‌ఎస్ కార్యక్రమానికి అధిక సంఖ్యలో పేదలు దరఖాస్తు చేసుకునేందుకు వస్తున్నారు. గతంలో ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు సచివాలయ ఉద్యోగులు వెరిఫికేషన్ చేసి అర్హులైన వారికి ఆన్‌లైన్ చేసేవారు. ఆ ఆప్షన్ నిలిపివేయడంతో వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉండిపోయాయి. కొత్త పింఛన్ల కోసం వచ్చే పేదలకు సమాధానం చెప్పలేక ఇబ్బంది పడుతున్నామని సచివాలయ ఉద్యోగులు వాపోతున్నారు. ప్రభుత్వ తీరుతో పింఛన్ సాయం అందక నష్టపోతున్నామని పేదవర్గాల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


