ముద్రగడను పరామర్శించిన ముదునూరి | - | Sakshi
Sakshi News home page

ముద్రగడను పరామర్శించిన ముదునూరి

Jun 28 2026 7:30 AM | Updated on Jun 28 2026 7:30 AM

ముద్రగడను పరామర్శించిన ముదునూరి కాంట్రాక్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం పండ్ల తోటలతో అధిక ఆదాయం సబ్‌ జైలును సందర్శించిన జిల్లా జడ్జి

నరసాపురం: అనారోగ్యంతో హైదరాబాద్‌ సింధు హాస్పటల్‌లో చికిత్స పొందుతున్న వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభంను శనివారం వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్‌, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్‌లు పరామర్శించారు. ముద్రగడ తనయుడు, ప్రత్తిపాడు నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జ్‌ ముద్రగడ గిరితో మాట్లాడారు. పద్మనాభం ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరలో కోలుకోవాలని ఆకాంక్షించారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డిస్ట్రిక్ట్‌ చైల్డ్‌ ప్రొటెక్షన్‌ యూనిట్‌, స్పెషలైజ్డ్‌ అడాప్షన్‌ ఏజెన్సీ, చిల్డ్రన్స్‌ హోమ్‌, వన్‌స్టాప్‌ సెంటర్లలో కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి స్థానిక అర్హత కలిగిన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా మహిళా, శిశు సంక్షేమ సాధికారిత అధికారిణి డి.శ్రీలక్ష్మి తెలిపారు. సోషల్‌ వర్కర్‌– 2, ఆయా–1, హౌస్‌ కీపర్‌–1, సెంటర్‌ అడ్మినిస్ట్రేటర్‌–1, పారా లీగల్‌ పర్సనల్‌/లాయర్‌–1, పారా మెడికల్‌ పర్సనల్‌ –1, సైకో సోషల్‌ కౌన్సిలర్‌–1, కంప్యూటర్‌ పరిజ్ఞానం కలిగిన ఆఫీస్‌ అసిస్టెంట్‌–1 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు జూన్‌ 29, 2026 నుంచి జూలై 8, 2026 వరకు దరఖాస్తు ఫారాలను సంబంధిత వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని, నింపి, అవసరమైన ధ్రువపత్రాల గెజిటెడ్‌ అధికారి అటెస్టెడ్‌ ప్రతులను జతచేసి జూలై 8, 2026 సాయంత్రం 5 గంటలలోపు భీమవరం కలెక్టరేట్‌ కాంపౌండ్‌ జిల్లా మహిళా, శిశు సంక్షేమ – సాధికారిత అధికారిణి కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు.

తాడేపల్లిగూడెం: పండ్ల తోటలతో రైతులకు అధిక ఆదాయం వస్తుందని వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ కట్టుపల్లి ధనుంజయరావు అన్నారు. అఖిల భారత సమన్వయ పరిఽశోధన పథకం కింద వెంకట్రామన్నగూడెంలోని ఉద్యాన వర్సిటీలో రెండు రోజులుగా జరుగుతున్న శిక్షణా కార్యక్రమం శనివారం ముగిసింది. వీసీ మాట్లాడుతూ నాణ్యమైన మొక్కల వినియోగం ద్వారా పండ్ల పంటలలో అధిక దిగుబడులు పొందవచ్చన్నారు. రైతులు ధ్రువీకరించిన నర్సరీల నుంచి మాత్రమే మొక్కలు కొనుగోలు చేయాలన్నారు. గిరిజన రైతుల సంక్షేమం, ఆర్థికాభివృద్ధి, జీవనోపాధి మెరుగుదల కోసం ఉద్యాన వర్సిటీ ముందుంటుందన్నారు. ఆధునిక శాసీ్త్రయ ప్రవర్తన పద్ధతులను రైతులు అవలంభించాలని ఉద్యాన వర్సిటీ విస్తరణ సంచాలకులు సీహెచ్‌.రూత్‌ తెలిపారు.

భీమవరం: భీమవరం పట్టణంలోని ప్రత్యేక ఉప కారాగారాన్ని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన్‌ ఎస్‌.శ్రీదేవి శనివారం ఆకస్మికంగా సందర్శించి జైలులోని ముద్దాయిలతో మాట్లాడారు. వారికి అందుతున్న వసతుల గురించి ఆరా తీశారు. న్యాయవాదిని నియమించుకోలేకపోతే దరఖాస్తు చేసుకుంటే న్యాయవాదిని నియమిస్తామని, ముద్దాయిలు సత్ప్రవర్తన కలిగి ఉండాలన్నారు. బెయిల్‌ మంజూరైన ముద్దాయిలు జామీనులు కోర్టులో దాఖలు చేసుకుంటే విడుదలకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. అనంతరం వంటగదిని సందర్శించి వారికి పెడుతున్న భోజనాన్ని రుచి చూశారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్ధ కార్యదర్శి ఎన్‌.శ్రీలక్ష్మి, 2వ అదనపు జ్యుడీషియల్‌ మొదటి తరగతి మేజిస్ట్రేట్‌ ఎన్‌.జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement