భయపెడుతున్న పులి | - | Sakshi
Sakshi News home page

భయపెడుతున్న పులి

Jun 28 2026 7:30 AM | Updated on Jun 28 2026 7:30 AM

బుట్టాయగూడెం మండలం గొట్టాలరేగులో పులి జాడ కోసం గిరిజనులు వెతుకుతున్న దృశ్యం

తానిగూడెం ప్రాంతంలో పులి ట్రాకర్‌ సిగ్నల్‌ కోసం ప్రయత్నిస్తున్న ప్రత్యేక ఫోర్స్‌ సిబ్బంది

బుట్టాయగూడెం: పశ్చిమ ఏజెన్సీప్రాంతంలోని బుట్టాయగూడెం మండలంలో గత కొద్దిరోజులుగా పెద్దపులి సంచరిస్తూ గిరిజనులను భయాందోళనకు గురి చేస్తుంది. అటవీప్రాంతం శివారులో సంచరిస్తున్న పెద్దపులి గ్రామ శివారులో కట్టేసి ఉన్న పశువులపై దాడి చేసి చంపేస్తుంది. దీంతో ప్రజల్లో మరింత భయాందోళన నెలకొంది. పులిని పట్టుకునేందుకు రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు పులికి మత్తు ఇచ్చి బంధించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. పులిని పట్టుకునేందుకు బెంగుళూరు, విశాఖపట్నం, శ్రీశైలం టైగర్‌ జోన్‌కు చెందిన ప్రత్యేక బృందాల వారు పులి సంచరించే ప్రాంతాల్లో కూడా సంచరిస్తూ పులిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే చిక్కినట్టే చిక్కి పులి పారిపోతూ అటవీశాఖ అధికారులకు, ప్రత్యేక బృందాలకు చుక్కలు చూపిస్తుంది. రేపల్లె, రేగులపాడుతోపాటు గానుగమామిడి సమీపంలో కూడా పులి దాదాపు దొరికిందనుకునే సమయంలో మళ్లీ తప్పించుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. శనివారం సాయంత్రానికి పెద్దపులి చింతకొండ, గొట్టాలరేవు, పూచికగొంది గ్రామాల్లో ఉండగా రాత్రి సమయానికి తానిగూడెం, మోతుగూడెం సమీపానికి వచ్చినట్లు పులికి అమర్చిన రేడియో కాలర్‌ ద్వారా వచ్చిన సిగ్నల్‌తో అధికారులు గుర్తించారు. తానిగూడెం, మోతుగూడెం గ్రామాలు గుబ్బల మంగమ్మగుడికి దగ్గరలో ఉండడంతో ఆయా గ్రామాల్లోని ప్రజలను ములగలంపల్లి సెక్షన్‌ ఆఫీసర్‌ కుర్సం రాంబాబు ఆధ్వర్యంలో అప్రమత్తం చేశారు. జంగారెడ్డిగూడెం రేంజ్‌ అధికారి దుర్గాప్రసాద్‌ బాబు, బీట్‌ ఆఫీసర్‌ మూర్తి ఆధ్వర్యంలో ఫారెస్ట్‌ సిబ్బంది, ప్రత్యేక బృందాలు, పులి జాడ కోసం అన్వేషిస్తున్నారు. ప్రస్తుతం పులి దట్టమైన అటవీప్రాంతాల్లో ఉన్న గ్రామాల్లో సంచరించడంతో ఫారెస్ట్‌ అధికారులకు అండగా ఆయా గ్రామాల గిరిజనులు కూడా సహకరిస్తున్నారు. పులి అడుగులను గుర్తించేందుకు అణువణువునా గాలిస్తూ సమాచారాన్ని అటవీశాఖ అధికారులకు అందిస్తున్నారు.

గుబ్బల మంగమ్మ తల్లి దర్శనం నిలిపివేత

బుట్టాయగూడెం: పెద్ద పులి సంచారం నేపథ్యంలో ఆదివారం గుబ్బల మంగమ్మతల్లి గుడి దర్శనం తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు కోర్స గంగరాజు, కోర్స రాంబాబులు తెలిపారు. శనివారం రాత్రి వారు మాట్లాడుతూ ఏజెన్సీ అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న పెద్ద పులి శనివారం రాత్రి సమయానికి మోతుగూడెం సమీపంలో ఉన్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారని చెప్పారు. పులి సంచరించే ప్రాంతం గుబ్బల మంగమ్మతల్లి గుడికి కేవలం రెండు కిలోమీటర్ల దూరం మాత్రమే ఉండటంతో పాటు గుడి పరిసర ప్రాంతాలకు కూడా వచ్చే అవకాశం ఉండని అధికారులు తెలపడంతో ముందు జాగ్రత్త చర్యల్లో దర్శనం నిలిపివేస్తున్నట్లు చెప్పారు. ఉదయం 9 గంటలకు పులి సంచారం ఎటు వైటు ఉందో చూసి అటవీ శాఖ అధికారుల అనుమతితో భక్తులను అనుమతిస్తామని చెప్పారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement