తాడేపల్లిగూడెం: ఉండవల్లి ఘటన ప్రజాస్వామ్యంపై దాడని తాడేపల్లిగూడెం వైఎస్‌ఆర్‌సీపి కన్వీనర్ వడ్డి రఘురాం విమర్శించారు. అమరావతిలోని ఉండవల్లి గ్రామానికి రైతుల సమస్యలపై మాట్లాడేందుకు వెళ్లిన ప్రతిపక్ష నాయకులపై రాళ్లు, కోడిగుడ్లతో దాడులు చేయడం టీడీపి అసహన రాజకీయాలకు నిదర్శనమన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ బృందం రైతుల ఆహ్వానం మేరకే పెనుమాక ప్రాంతానికి వెళ్లిందన్నారు. రైతుల సమస్యలను తెలుసుకొని వారికి అండగా నిలవడమే ఆ పర్యటన ఉద్దేశమన్నారు. రైతుల గోడు వినిపించకుండా దాడులతో భయభ్రాంతులకు గురి చేయాలని టీడీపీ ప్రయత్నించడం అత్యంత దుర్మార్గమన్నారు. పోలీసులపైనా దాడి చేసి గాయపర్చడం టీడీపీ గూండాయిజానికి నిదర్శనమన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా కొన్ని రోజులుగా ఉద్యమిస్తున్న పెనుమాక రైతుల ఆవేదనను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందన్నారు. వైఎస్సార్‌సీపీ బృందంపై దాడి వెనుక ప్రభుత్వ కుట్ర స్పష్టంగా కనిపిస్తోందన్నారు. అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు గూండాలను ప్రోత్సహిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారన్నారు. ఎన్ని దాడులు, బెదిరింపులు చేసినా రైతుల పక్షాన వైఎస్సార్‌సీపీ పోరాటం ఆగదన్నారు.
వైఎస్సార్‌సీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ కన్వీనర్ వడ్డి రఘురాం


