పెంటపాడు: పెంటపాడు మండలంలో కొందరు బీఎల్‌వోల బాద్యతా రాహిత్యం కొట్టొచ్చినట్లు కనపడుతోంది. బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి పారదర్శకంగా ఓట్ల నమోదు చేయాలి. చదువురాని వారికి సహకారంగా వారి వివరాలు అడిగి ఫాం పూర్తి చేయాలి. అలా జరగడం లేదు. పెంటపాడు మండలం మౌంజీపాడులో అక్కడ వీఆర్వోతో పాటు, బీఎల్‌వోలు బాధ్యతా రాహిత్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒక వృద్ధురాలి అప్లికేషన్ ఫాంను గ్రామానికి చెందిన రాష్ట్ర తెలుగు రైతు నాయకుడు పాతూరి రాంప్రసాద్ పూర్తి చేశారు. వాస్తవంగా బీఎల్‌వోలు ఈ డ్యూటీ చేయాలి. ఇంత జరుగుతున్నా మండల రెవిన్యూ యంత్రాంగం పట్టించుకోవడం లేదు. పలు గ్రామాల్లో ఇలాగే జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఆరకమణలు తొలగించాలి
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో ప్రభుత్వ నీటి వనరులు, చెరువు భూములపై ఆక్రమణలను వేగంగా తొలగించి, భవిష్యత్తులో పునరాక్రమణలు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ చాంబర్ నుంచి శనివారం తహసీల్దార్లు, ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, జలవనరుల శాఖ అధికారులతో జిల్లా వాచ్‌డాగ్ కమిటీ సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 362.21 ఎకరాల విస్తీర్ణంలో 7,458 ఆక్రమణలు గుర్తించినట్లు తెలిపారు. ఇంతవరకు 40 ఎకరాల పరిధిలో 1,257 ఆక్రమణలు తొలగించినట్లు తెలిపారు.


