నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
నరసాపురం: అసభ్యకర వీడియోలు సృష్టించి వివాహితను బెదిరింపులకు గుర్తిచేస్తున్న వ్యక్తిని శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. నరసాపురం టౌన్ సీఐ ఆకుల రఘు టౌన్ స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. పశ్చి మబెంగాల్‌కు చెందిన వివాహిత భర్త నరసాపురంలో ఉద్యోగం చేస్తున్నారు. పట్టణంలోని రుస్తుంబాదలో నివాసం ఉంటున్నారు. వివాహితకు కొన్ని నెలల క్రితం ఇన్‌స్ర్ట్రాగామ్‌లో ఛత్తీస్‌గడ్‌కు చెందిన నిందితుడు దీపక్‌కుమార్ పరిచయమయ్యాడు. కొద్ది రోజులుగా వివాహితకు సంబందించి ఫేక్ న్యూడ్ వీడియోలు, నకిలీ ఐడీతో సోషల్ మీడియాలో పెట్టి డబ్బు డిమాండ్ చేయడంతో పాటు అసభ్యకరంగా మాట్లాడుతూ వేధిస్తున్నాడు. దీనిపై వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి, దీపక్‌ను నరసాపురం రప్పించి మొగల్తూరు రోడ్డులో వలపన్ని పట్టుకున్నట్టు సీఐ వివరించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచినట్టు చెప్పారు.
భీమవరం: మాదకద్రవ్యాలు వినియోగించినా, కొనుగోలు, విక్రయం, రవాణా వంటివాటిలో పాల్గొన్నా మాదక ద్రవ్యాల నిరోధక చట్టం ప్రకారం శిక్షార్హులవుతారని భీమవరం 3వ అదనపు జిల్లా జడ్జి, మండల న్యాయ సేవా సంస్థ చైర్మన్ బి లక్ష్మీనారాయణ తెలిపారు. శనివారం భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో మాదక ద్రవ్యాలు, అక్రమ రవాణాపై ఆటో డ్రైవర్లు, ఆశా వర్కర్లు, సచివాలయ మహిళా పోలీసులు, అంగన్‌వాడీ కార్యకర్తలకు ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మాదక ద్రవ్యాలు వినియోగిస్తే కలిగే దుష్పరిణామాలు, ఆరోగ్య సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చట్టపరమైన శిక్షలు వంటి వాటిపై విషయాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) ఎం సుధారాణి, ప్రిన్సిపల్ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) ఇ రమ్య, ఒకటవ అదనపు సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) పి హనీష, 2వ అదనపు జ్యుడీషియల్ మొదటి తరగతి మేజిస్ట్రేట్ ఎన్ జ్యోతి, భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు యేలేటి యోహాన్, మహిళా పోలీస్ సీఐ అహమదున్నీసా, టూటౌన్ సీఐ పి మురళీకృష్ణ, న్యాయవాదులు, ప్యానల్ న్యాయవాదులు పాల్గొన్నారు.
ద్వారకాతిరుమల: శ్రీవారి శాశ్వత నిత్యాన్నదాన పథకానికి ఇద్దరు భక్తులు శనివారం వేరువేరుగా రూ. 2,11,123 విరాళంగా అందజేశారు. కె.జగ్గవరంనకు చెందిన బి.వెంకట సాయి సందీప్ రూ.1,00,007, ఉండ్రాజవరంనకు చెందిన తాతిని అమృత రూ. 1,11116 ఆలయ కార్యాలయంలో జమ చేశారు. దాతలకు ఆలయ విరాళం బాండ్ పత్రాలను అందించారు. శ్రీవారి క్షేత్రంలో శనివారం భక్తులు పోటెత్తారు.
వివాదాస్పద భూమిపై కలెక్టర్ ఆరా..
ద్వారకాతిరుమల: తిమ్మాపురం పంచాయతీ లక్ష్మీపురంలోని వివాదాస్పద భూమి గురించి కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆరా తీస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం. శ్రీవారి దేవస్థానం ఈఓ వేండ్ర త్రినాధరావుకు కలెక్టర్ శనివారం ఫోన్ చేసి మాట్లాడారు. లక్ష్మీపురంలోని శ్రీ సంతాన వేణుగోపాల జగన్నాధ, వేంకటేశ్వరస్వామి వారి ఆలయాన్ని 1992 లో మంత్రరత్నం అమ్మాజీ (లక్ష్మీ అమ్మవారు) కుటుంబ సభ్యుల నుంచి తమ దేవస్థానం దత్తత తీసుకుందని తెలిపారు. అప్పటి నుంచి ఆ ఆలయానికి చెందిన ఆర్‌ఎస్ నెంబర్ 38/1 లోని 1.89 ఎకరాల భూమిని దేవస్థానమే సాగు చేస్తోందని కలెక్టర్‌కు ఈఓ చెప్పారు. ఈ భూమికి సంబంధించిన రెవెన్యూ రికార్డుల్లో అమ్మాజీ కుటుంబ సభ్యుడైన మంత్రరత్నం ప్రతివాద భయంకర వెంకట సంపత్‌కుమారాచార్యులు పేరు ఉండేదని, అయితే రెవెన్యూ అధికారులు ఇటీవల ఆ పేరును తొలగించి, కమ్మవారి సేవ సంఘం, ద్వారకాతిరుమల మండలం పేరును చేర్చారని తెలిపారు. దీనిపై వివాదం రాజుకోవడంతో సంపత్‌కుమారాచార్యులు కుటుంబ సభ్యులు స్పందించి, వారి పూర్వీకులు సదరు భూమిని దేవస్థానానికి అప్పగించినట్టు లేఖ ద్వారా తమకు తెలిపారన్నారు. సదరు భూమిలో స్వామివారి సేవలు, అలంకారాల నిమిత్తం తులసిని సాగు చేసేవారమని ఈఓ కలెక్టర్‌కు వివరించారు.


