షాపులు మూసుకోవాల్సిన పరిస్థితి
వ్యాపారం లేక వెలవెలబోతున్నాయి
● ప్రైవేటు విద్యాసంస్థల్లో అక్రమ వ్యాపారం
● వెలవెలబోతున్న పుస్తకాల షాపులు
భీమవరం : ప్రైవేట్ విద్యాసంస్థల్లో నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న విద్యాసామగ్రి విక్రయాలతో బుక్‌సెల్లర్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. గతంలో విద్యాసంవత్సరం ప్రారంభంలో జూన్ నెల నుంచి సుమారు మూడు నెలల పాటు పట్టణాలు, గ్రామాల్లోని పుస్తకాల షాపుల్లో విక్రయాలు జోరుగా సాగేవి. పుస్తకాలతో పాటు పెన్నులు, పెన్సిళ్లు, జామెట్రీ బాక్సులు, పుస్తకాల అట్టలు వంటివి విక్రయించి అనేకమంది జీవనం సాగించేవారు. జిల్లాలో దాదాపు 300కు పైగా పుస్తకాల షాపులుండగా, వాటిలో సుమారు మూడు వేల మంది వరకు పనిచేస్తున్నట్లు అంచనా. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి, షాపులకు అద్దెలు, ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తూ అనేకమంది వ్యాపారులు జీవిస్తున్నారు. దాదాపు 40 ఏళ్లుగా పుస్తకాలు, విద్యాసామగ్రి వ్యాపారం చేస్తున్న అనేకమంది.. నేడు విక్రయాలు లేక లబోదిబోమంటున్నారు.
గతంలో షాపుల్లోనే విక్రయాలు..
గతంలో టెక్స్‌ట్ బుక్స్, నోట్‌బుక్స్ అన్నీ పుస్తకాల షాపుల్లోనే విక్రయించేవారు. అయితే, 2001 సంవత్సరం నుంచి ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను ఉచితంగా ఇవ్వడం ప్రారంభించింది. ఆ తర్వాత 2019లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పాఠ్యపుస్తకాలతో పాటు నోట్‌బుక్స్, ఇతర విద్యాసామగ్రిని కూడా ఉచితంగా అందించడం మొదలుపెట్టారు. దీనితో పుస్తక వ్యాపారులు కేవలం ప్రైవేట్ విద్యాసంస్థల విద్యార్థులకు నోట్‌పుస్తకాలు, ఇతర విద్యాసామగ్రిని విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. విద్యాసంవత్సరం ప్రారంభంలో పుస్తకాల షాపులతో పాటు యూనిఫామ్స్ విక్రయించే బట్టల షాపులు, షూస్, బెల్టులు, గొడుగులు అమ్మే ఫ్యాన్సీ షాపులు విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కళకళలాడేవి.
ప్రైవేట్ విద్యాసంస్థల ఆంక్షలతో వ్యాపారాలు నిల్..
గత కొంతకాలంగా ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యార్థులకు పుస్తకాలతో పాటు యూనిఫామ్, ఇతర విద్యాసామగ్రి మొత్తాన్ని తామే విక్రయించడం ప్రారంభించాయి. అంతటితో ఆగకుండా, తప్పనిసరిగా తమ వద్దనే కొనుగోలు చేయాలనే ఆంక్షలు విధించడంతో వారి వ్యాపారం జోరందుకుంది. యాజమాన్యాలు విద్యాసామగ్రిని అధిక ధరలకు విక్రయిస్తున్నా ప్రశ్నించే అవకాశం లేకుండా పోయింది. జిల్లాలో దాదాపు 600 వరకు ప్రైవేట్ విద్యాసంస్థలుండగా, వాటిలో సుమారు 2 లక్షల మంది వరకు విద్యార్థులున్నట్లు అంచనా. వీరంతా ఆయా విద్యాసంస్థల్లోనే పుస్తకాలు, విద్యాసామగ్రి కొనుగోలు చేయాల్సి రావడంతో ప్రైవేటు వ్యాపారుల వద్ద అమ్మకాలు పూర్తిగా తగ్గిపోయాయి.
స్కూళ్లలో విద్యాసామాగ్రి విక్రయించకూడదు
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రైవేట్ విద్యాసంస్థలు పుస్తకాలు, విద్యాసామగ్రిని విక్రయించకూడదు. అయినప్పటికీ విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో విద్యాసంస్థల పుస్తకాల వ్యాపారం ‘మూడు పువ్వులు ఆరు కాయలు’ అన్న చందంగా సాగిపోతోంది. ప్రైవేట్ విద్యాసంస్థల్లో పుస్తకాల విక్రయాలను అడ్డుకుంటేనే తమకు బతుకుతెరువు ఉంటుందని, మరికొంతమందికి ఉపాధి కల్పించగలుగుతామని వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ఈ అక్రమ విద్యా వ్యాపారానికి అడ్డుకట్ట వేయాలని వ్యాపారులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
పుస్తకాల విక్రయాల ద్వారా అనేక మంది వ్యాపారులతో పాటు షాపుల్లో పనిచేసే వేలాది మంది కార్మికులు జీవిస్తున్నారు. ఇటీవల ప్రైవేట్ విద్యాసంస్థలు చేస్తున్న వ్యాపారం వల్ల మా షాపులు మూసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రభుత్వం వెంటనే ప్రైవేట్ విద్యాసంస్థల విద్యాసామగ్రి అమ్మకాలను అడ్డుకోకపోతే, ఆందోళన బాట పట్టాల్సి వస్తుంది.
– వి.రాజా, పుస్తకాల షాపు యజమాని, భీమవరం
పుస్తకాల షాపుల్లో విక్రయాలు లేక వెలవెలబోతున్నాయి. మేము ప్రభుత్వానికి అన్ని రకాల పన్నులు చెల్లిస్తూ వ్యాపారం చేస్తుంటే, ప్రైవేట్ విద్యాసంస్థలు ఎటువంటి పన్నులు చెల్లించకుండా వ్యాపారాలు చేస్తూ పుస్తక షాపుల యజమానుల పొట్ట కొడుతున్నాయి. ప్రభుత్వం వెంటనే ప్రైవేట్ విద్యాసంస్థల వ్యాపారానికి అడ్డుకట్ట వేయాలి.
– వబిలిశెట్టి వరప్రసాదరావు, వ్యాపారి, భీమవరం


