కొయ్యలగూడెం: విత్తన వ్యాపారిపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. మండల వ్యవసాయ అధికారి కేవీఎన్ పోశారావు తెలిపిన వివరాల ప్రకారం కొయ్యలగూడెం మండలం గవరవరం గ్రామంలోని శ్రీ స్వరాజ్య లక్ష్మి రైస్‌మిల్లు ప్రాంగణంలో గుంటూరు జిల్లా నల్లపాడుకు చెందిన శ్రీ బాలాజి సీడ్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థకు చెందిన రూ.6.24 లక్షల విలువైన 43.45 క్వింటాళ్ల పత్తి విత్తనాలను గతంలో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి నుంచి సేకరించిన నమూనాలను (శాంపిల్స్) విశ్లేషణకు పంపగా, అవి నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేవని తేలింది. దీంతో, సెంట్రల్ లైసెన్స్‌లో అనుమతి లేని ప్రదేశంలో నాణ్యత లేని విత్తనాలను ప్యాకింగ్‌కు సిద్ధంగా ఉంచి రైతులను, పాలనా యంత్రాంగాన్ని మోసగించినందుకు, అలాగే విత్తన చట్టం నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను సదరు సంస్థ ప్రతినిధి చప్పిడి బాలకృష్ణపై పూర్తి విచారణ నిమిత్తం క్రిమినల్ కేసు నమోదు చేశారు.


