సర్‌ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

సర్‌ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి

Jun 27 2026 12:19 AM | Updated on Jun 27 2026 12:19 AM

వృద్ధుడి మృతదేహానికి అంత్యక్రియలు

వీరవాసరం: సర్‌ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని జాయింట్‌ కలెక్టర్‌ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి అన్నారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం జరుగుతున్న తీరును శుక్రవారం ఆయన వీరవాసరం మండలం నందమూరుగరువు గ్రామంలో పర్యటించి, పరిశీలించారు. క్షేత్రస్థాయిలో ఓటర్ల ఇళ్లకు వెళ్లి వారితో మాట్లాడారు. గడువులోగా ఎన్యుమరేషన్‌ పత్రాలను బీఎల్‌ఓలకు తిరిగి అందజేయాలన్నారు. పూర్తి చేసిన ఎన్యుమరేషన్‌ పత్రాలను ఎప్పటికప్పుడు డిజిటలైజేషన్‌ చేయాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్‌ ఏవీ రామాంజనేయులు, ఎంపీడీఓ కేఎం వైభవనం తదితరులు ఉన్నారు.

తణుకు అర్బన్‌: గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహానికి ఉందుర్తి పాల్‌ ఫౌండేషన్‌ తరఫున శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించారు. తణుకు రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నాలుగు రోజుల క్రితం మృతి చెందిన 60 నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సున్న వృద్ధుడి మృతదేహాన్ని బంధువుల రాక కోసం తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రిలోని మార్చురీలో ఉంచారు. ఎవరూ రాకపోవడంతో పోలీసుల సూచనలతో ముందుకొచ్చిన ఫౌండేషన్‌ చైర్మన్‌ ఉందుర్తి ప్రసన్ననకుమార్‌ సహకారంతో సభ్యులు అంత్యక్రియలు చేశారు.

బీఎల్‌ఓల బాధ్యతారాహిత్యంతో ఓటర్లకు ఇబ్బందులు

కొయ్యలగూడెం: మండలంలో కొందరు బీఎల్‌ఓల బాధ్యతారాహిత్యంపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనల ప్రకారం బీఎల్‌ఓలు ఇంటింటికి వెళ్లి రెండు మూడు సార్లు పరిశీలన చేయాల్సి ఉండగా, అందుకు విరుద్ధంగా ఓటర్లను సచివాలయాలకే రప్పించి ఫారాలను పూర్తి చేస్తున్నారు. తాజాగా బయ్యన్నగూడెంలో కూడా ఇదే తరహాలో ప్రక్రియ కొనసాగుతుండటం పట్ల స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కూలి పనులను కూడా వదులుకుని రెండు మూడు రోజులుగా సచివాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఓటర్లు ఆవేదన చెందుతున్నారు. నియోజకవర్గంలో విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 19 మంది సిబ్బందిపై తహసీల్దార్‌ ఎన్‌.నాగరాజు చర్యలు తీసుకున్నప్పటికీ, మిగిలిన వారి ప్రవర్తనలో మార్పు రాకపోవడం గమనార్హం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement