తాడేపల్లిగూడెం: విద్యార్థులు సామాజిక స్పృహతో ఆలోచించాలని ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ కోరారు. వెంకట్రామన్నగూడెంలోని ఉద్యానవర్సిటీ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల పక్షాన ఆలోచిస్తూ విద్యార్థులు ముందుకెళితే విద్యకు సార్తకత ఏర్పడుతుందన్నారు. ఉద్యాన విద్య ఉపాధి, ఉద్యోగావకాశాలకే కాకుండా ప్రజలకు పౌష్టికాహార భద్రత, ఆహారభద్రత, ఆరోగ్య భద్రత కల్పించే కార్యక్రమంలో భాగస్వాములైనట్టేనన్నారు. విశ్వవిద్యాలయంలో మంచి ఆడిటోరియం నిర్మాణానికి, బీఎస్‌సీ హార్టీకల్చర్ డిగ్రీకి యూజీసీ నుంచి తగిన గుర్తింపు ఇప్పించడానికి కృషి చేస్తానన్నారు. గడచిన 19 ఏళ్ల కాలంలో ఉద్యానవర్సిటీ సాధించిన ప్రగతిని వీసీ కె.ధనుంజయరావు వివరించారు. 4734 మంది ఉద్యాన విద్యలో బీఎస్సీ ఉద్యాన పట్టభద్రులు, 564 మంది ఎంఎస్‌సీ. 88 మంది పీహెచ్‌డీ పట్టభద్రులు వర్సిటీ నుంచి వెళ్లి. ఉపాధి, ఉద్యోగ రంగాల్లో స్ధిరపడ్డారన్నారు. రాష్ట్రంలో ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని 30.136 లక్షల హెక్టార్ల నుంచి 30.15 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి స్థాయికి పెంచేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు వీసీ చెప్పారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన స్టాల్స్‌ను కేంద్ర మంత్రి పరిశీలించారు. రిజిస్ట్రార్ ఎం.మాధవి, వర్సిటీ అధికారులు పాల్గొన్నారు.


