ఇరగవరం: మండలంలోని అయితంపూడిలో శుక్రవారం వైఎస్సార్ సీపీ నాయకులు పొలాలను ఆనుకుని వేస్తున్న రోడ్డు పనులు నిలిపివేయాలని కోర్టు ఆదేశాలు ఇచ్చినా రోడ్డు పనులు ఆపకుండా చేస్తున్నారని మాజీ సర్పంచ్, వైఎస్సార్ సీపీ నాయకురాలు ఉప్పులూరు లావణ్య ఆరోపించారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ కూటమి నాయకులు, అధికారులు కక్షపూరిత చర్యల్లో భాగంగా మా పొలాలను అనుకుని రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారని పేర్కొన్నారు.. సర్వే పూర్తి చేసి అప్పుడు ప్రభుత్వ భూమి ఎంత వరకు ఉంటే అంతవరకు రోడ్డు వేయండి అని ఎంత చెప్పినా దౌర్జన్యంగా రోడ్డు వేస్తున్నారని వాపోయారు. దీంతో కోర్టును ఆశ్రయించడంతో పనులు నిలిపేయాలని ఆదేశాలు ఇచ్చారన్నారు. ఈ ఆర్డర్లను ఎంపీడీఓ, తహసీల్దార్, మండల సర్వేయర్‌లకు వాట్సాప్‌లో పెట్టామని, అయినా అధికారులు ఆదేశాలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై ఎంపీడీఓ ఎ.శ్రీనివాసును వివరణ కోరగా అధికారికంగా కోర్టు ఆర్డర్ తమకు అందలేదని, పనులు నిలిపేయాలని ఏదైనా ఆర్డర్ అధికారికంగా వస్తే నిలుపుదల చేస్తామన్నారు.


