దిశ సమావేశానికి గైర్హాజరు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఏలూరు ఎంపీని టీడీపీ క్యాడరే కాదు... కూటమి ప్రజాప్రతినిధులు కూడా లైట్ తీసుకున్నారు. కొద్ది నెలల క్రితం వరకు మంత్రి కొలుసు పార్థసారథికి సమాంతరంగా హవా సాగించిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ ప్రాభవం కోల్పోయారు. మార్చి 14, 15 తేదీల్లో హైదరాబాద్‌లో డ్రగ్స్ కేసులో అరెస్టు కావడం, పార్టీ నుంచి సస్పెన్షన్, కొద్ది రోజుల అజ్ఞాతం అనంతరం రెండు నెలల నుంచి మళ్ళీ జిల్లాకు అడపాదడపా రావడం మొదలుపెట్టారు. తాజా ఎంపీ పర్యటనకు కేడర్‌తో పాటు లీడర్ల నుంచి స్పందన నిల్. మరోవైపు బుధవారం ఎంపీ అధ్యక్షతన జరిగిన దిశ సమావేశానికి టీడీపీ ఎమ్మెల్యేలతో పాటు కూటమి ఎమ్మెల్యేలు ఒక్కరూ హాజరుకాకపోవడం జిల్లాలో తీవ్ర చర్చకు దారితీసింది.
ఏడాదిన్నర పాటు హవా
జిల్లాలో అధికార పార్టీలో ఎంపీ పుట్టా మహేష్, మంత్రి కొలుసు పార్థసారథిలు అధికారంలోకి వచ్చిన నాటి నుండి హవా సాగించారు. ప్రధానంగా ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ లోకేష్ టీమ్ అంటూ జిల్లాలో బదిలీలు మొదలుకొని అన్ని వ్యవహారాల్లో కేంద్రబిందువుగా మారి నియోజకవర్గాల్లో హడావుడి చేశారు. ఇదంతా ఏడాదిన్నరకే పరిమితమైంది. స్థానిక ప్రజాప్రతినిధులతో అక్కడక్కడ విబేధాలున్నా లోకేష్ టీమ్ కావడం, పార్టీలో పరపతి బలంగా ఉండటంతో ఎమ్మెల్యేలు కూడా అనేక సందర్భాల్లో ఎంపీకి అడ్డు చెప్పని పరిస్ధితి. ఈ పరిణామాల క్రమంలో ఈ ఏడాది మార్చి 14న తెలంగాణాలో డ్రగ్స్ పార్టీలో రెడ్‌హ్యాండెడ్‌గా ఎంపీ దొరకడం, అలాగే డ్రగ్స్ తీసుకున్నట్లు పాజిటివ్ రిపోర్ట్ రావడం జిల్లాలో తీవ్ర సంచలనంగా మారింది. ఇలాంటి ఘటనల్లో జిల్లాల్లో కీలకనేత దొరకడం రాజకీయ చరిత్రలో ఇదే ప్రథమం కావడంతో పార్టీలోనూ, ప్రజల్లోనూ దీనిపై విస్తృత చర్చ జరిగింది. వెంటనే పార్టీ సస్పెండ్ చేయడం పుట్టా అనుచరులకు మద్ధతుగా జిల్లా అంతా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి హడావుడి చేయడం, టీడీపీ ప్రజాప్రతినిధులే అనేక చోట్ల ఫ్లెక్సీల ఏర్పాటుపై అసహనం వ్యక్తం చేయడం, ఇలా వరుస సంఘటనలతో ఎంపీ ప్రతిష్ట పూర్తిగా మసకబారింది. నెల రోజుల వివాదం తరువాత ఏప్రిల్ 19న గన్నవరం నుంచి ఏలూరుకు ఎంపీ ర్యాలీగా హాజరై ఎమ్మెల్యేలందరినీ కార్యాలయానికి ఆహ్వానిస్తే ఎమ్మెల్యేలు హాజరై ఎంపీకి సంఘీభావం పలికినట్లుగా కనిపించి వెళ్ళిపోయారు. ఆ తరువాత నుంచి ఎంపీని జిల్లాలో ఎవరూ సీరియస్‌గా తీసుకోని పరిస్థితి.
ఏలూరు పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి పనులు, ఇతర అంశాలపై ప్రతి నెల ఎంపీ అధ్యక్షతన దిశ పేరుతో జిల్లా సమనస్వయ కమిటీ సమావేశం జరుగుతుంది. దీనికి కలెక్టర్, ఎస్పీ, జడ్పీ చైర్మన్, 7 నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా హాజరై అభివృద్ధి పనులకు కేంద్రం నుంచి నిధులు, ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన ప్రతిపాదనలు ఇలా అన్నింటిపై విస్తృతంగా చర్చిస్తారు. ఎంపీని ప్రజాప్రతినిధులందరూ లైట్ తీసుకున్నారు. అలాగని ఎమ్మెల్యేలు ఇతర ప్రాంతాలు, వేరే కార్యక్రమాల్లో కాకుండా ఆయా నియోజకవర్గాల్లోనే కార్యక్రమాల్లో పాల్గొనడం విశేషం. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పార్టీ సమస్వయ కమిటీ సమావేశం నిర్వహించడం, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని పెదపాడు, దుగ్గిరాల్లో పర్యటనలు నిర్వహించడం, ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు ఉంగుటూరులో కార్యక్రమాల్లో పాల్గొనడం ఇలా ఏడుగురు ఎమ్మెల్యేలు ముఖం చాటేయడం కూటమిలో చర్చకు దారితీసింది.
ఎంపీ సమావేశానికి ఎమ్మెల్యేలు గైర్హాజరు
డ్రగ్స్ కేసు ముందు వరకూ జిల్లాలో చక్రం తిప్పిన ఎంపీ పుట్టా
పార్టీ సస్పెన్షన్, కేసు తదనంతర పరిణామాలతో మసకబారిన ఇమేజ్
ఏలూరు జిల్లా దిశ సమావేశానికి మొత్తం ఎమ్మెల్యేలు గైర్హాజరు
సమావేశంలో మందుబాబులపై కేసులు రాయొద్దంటూ ఎంపీ వ్యాఖ్యలు


