ఏమిటి ‘సర్‌’ ఇది? | - | Sakshi
Sakshi News home page

ఏమిటి ‘సర్‌’ ఇది?

Jun 27 2026 12:19 AM | Updated on Jun 27 2026 12:19 AM

కలెక్టర్‌ ముఖ్య సూచనలు అంటూ సర్క్యులర్‌ విడుదల చేశారు. ఈనెల 25 నాటికే 100 శాతం ఎన్యూమరేషన్‌ ఫారాలు పంపిణీ పూర్తి చేయాలి. ఎలాంటి రిమార్కులు లేకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలంటూ పలు సూచనలతో సర్క్యులర్‌ విడుదల చేశారు.

పాలకొల్లు సెంట్రల్‌: రాష్ట్రంలో స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) వేగవంతంగా చేస్తున్నారు. సర్‌ పూర్తి చేయడానికి ఇంకా సమయం ఉన్నా తమపై ఒత్తిడి తీసుకొచ్చి ఇబ్బందులకు గురిచేస్తున్నారని సచివాలయ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శిక్షణ పూర్తయిన అనంతరం జూన్‌ 15 నుంచి జులై 14 వరకూ బీఎల్‌వోలు ఇంటింటి సర్వేకు వెళ్లి ఫాంలు అందజేసి వాటిని పూర్తి చేసిన అనంతరం ఆన్‌లైన్‌ చేయాలి. జులై 14 లోపు పోలింగ్‌ స్టేషన్ల హేతుబద్ధీకరణ చేయాలి. జులై 21 నాటికి ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురించాలి. జులై 21 నుంచి ఆగస్టు 20 వరకూ ఓటరు జాబితాలో అభ్యంతరాలు ఉంటే దరఖాస్తులు స్వీకరిస్తారు. జులై 21 నుంచి సెప్టెంబర్‌ 18 వరకూ అభ్యంతరాలు విచారించి వాటిని పరిష్కరించాలి. సెప్టెంబర్‌ 22న ఓటరు తుది జాబితాను విడుదల చేస్తారు. జిల్లాలో 14.75 లక్షల ఓటర్లు ఉన్నారు. ఇంతవరకూ 13.80 లక్షల వరకూ సర్‌ ఫారాలు పంపిణీ చేశారు. సర్‌ ఫారాలు జిల్లాలో 93 శాతం పంపిణీ జరగగా సుమారు 10 శాతం డిజిటలైజేషన్‌ అయినట్లు సమాచారం. జిల్లాలో ఈ నెలాఖరులోపు పూర్తిచేయాలని ప్రత్యేకించి పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓ సర్క్యులర్‌ రిలీజ్‌ చేయడంపై బీఎల్‌వోలు మండిపడుతున్నారు.

ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాం

ఎన్యూమరేషన్‌ ఫాం పంపిణీ అనంతరం ప్రతి బీఎల్‌వో రోజుకు సగటున ఎస్‌ఐఆర్‌ ఫారాలు 20 శాతం డిజిటలైజేషన్‌ చేయాలి. ఒక్కో బీఎల్‌వోకు సుమారు వెయ్యి ఓటర్ల వరకూ నమోదు చేయాల్సి ఉంటుంది. రోజుకు 20 శాతం చొప్పున పూర్తి చేయాలంటే నెలాఖరుకు పూర్తి చేసి అప్పగించాలని ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఒక్కో ఫారం సేకరించాలంటే ఓటరు అన్ని వివరాలు దగ్గర పెట్టుకుని ఉంటే ఆ ఫారం పూర్తి చేయడానికి దాదాపుగా 15 నిమిషాలు పడుతుంది. అదే పూర్తి వివరాలు లేకపోతే వారి వివరాలు తీసుకోవాలంటే బీఎల్‌వోలకు తలకు మించిన భారం అవుతుందని వాపోతున్నారు. వారి పుట్టింటి నుంచి తండ్రి లేదా తాతగారి 2002 నియోజకవర్గ ఓటర్ల వివరాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల వారు ఏ నియోజకవర్గంలో ఉన్నారో ఏ మండలం, ఏ గ్రామం, వారి సీరియల్‌ నెంబర్‌ను సేకరించాలంటే దాదాపు 30 నుంచి 40 నిమిషాలు పడుతుంది. ఇన్ని వివరాలను సేకరించి నమోదు చేయాలంటే తలకు మించిన భారం అవుతుందని బీఎల్‌వోలు వాపోతున్నారు.

ఉదయం నుంచి రాత్రి వరకూ..

జులై 14 వరకూ గడువు ఉన్నా తమపై ఒత్తిడి తీసుకువచ్చి జూన్‌ 30 నాటికే పూర్తి చేయాలని ఒత్తిడి చేయడంపై ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ సర్‌ కార్యక్రమాలు పూర్తయ్యే వరకూ సెలవు రోజులు కూడా పనిచేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఆదివారాలు కూడా పనిచేయాల్సిందేనని ఉన్నతాధికారులు ఒత్తిడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కనీసం సెలవు రోజున కూడా కుటుంబ సభ్యులతో ఉండలేకపోతున్నామని వాపోతున్నారు. తమ పిల్లలతో మాట్లాడి సుమారు నెల రోజులు కావస్తుందని కొందరు సచివాలయ సిబ్బంది ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

ఉదయం 7 గంటలకు వస్తే.. రాత్రి 10 గంటలైనా సరే ఇంటికి వెళ్లే పరిస్థితి కనిపించడంలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఉన్నతాధికారులు తమ టార్గెట్‌లు పూర్తి చేసుకుని మొదటి స్థానంలో నిలబడేందుకు తమను ఒత్తిడికి గురిచేస్తున్నారని బీఎల్‌వోలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

గడువు ఉన్నా వేధిస్తున్నారంటూ బీఎల్‌ఓల ఆవేదన

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement