పాలకొల్లు సెంట్రల్: పట్టణంలోని పాలకొల్లు, భీమవరం రోడ్డులో సీసీ రోడ్డు నిర్మాణం సందర్భంగా రహదారిని మూసివేస్తున్నట్లు ఆర్‌అండ్‌బీ ఏఈఈ మూర్తి తెలిపారు. శుక్రవారం ఏఈఈ మూర్తి మాట్లాడుతూ రైల్వే గేటు దాటిన అనంతరం ఎఫ్‌సీఐ రోడ్డు నుంచి పూలపల్లి వంతెన వరకూ సీసీ రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభించినట్లు తెలిపారు. సుమారు రూ.3 కోట్ల వ్యయంతో పది మీటర్ల వెడల్పు, 800 మీటర్ల పొడవుతో ఈ రోడ్డు నిర్మాణం జరుగుతుందన్నారు. దాదాపుగా ద్విచక్ర వాహనాలకు ఆటంకం లేకుండా చూస్తామని కార్లు, బస్సులు, భారీ వాహనాలు మాత్రం పూలపల్లి బైపాస్ రోడ్డు నుంచి వెళ్లాలని సూచించారు. భీమవరం వెళ్లే వాహనదారులు రైల్వే గేటు దాటిన అనంతరం ఆంజనేయస్వామి ఆలయం రోడ్డు నుంచి హౌసింగ్ బోర్డు మీదుగా పూలపల్లి బైపాస్ రోడ్డుకు వెళ్లే మార్గం ఉంటుందన్నారు.
నరసాపురం: పట్టణంలోని 31వ వార్డులో మత్స్య శాఖ కార్యాలయం పక్కన ఉన్న పశువుల చెరువును ఇదే ప్రాంతానికి చెందిన కొందరు కూటమి నాయకుల పర్యవేక్షణలో శుక్రవారం పూడ్చే ప్రయత్నం వివాదాస్పదమైంది. ఆ వార్డుకు చెందిన వైఎస్సార్‌సీపీ నేత తోట సుబ్బారావు ఇప్పటికే పలు ధపాలుగా పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో చెరువును శుభ్రం చేయించాలని ఫిర్యాదులు అందజేశారు. చెరువును శుభ్రం చేయకుండా, మొత్తం ప్రభుత్వ చెరువును పూడ్చే ప్రయత్నం చేయడంతో సుబ్బారావు, మరికొందరు అధికారులను నిలదీశారు. వార్డులో ప్రధాన రహదారికి పక్కన ఎన్నో ఏళ్లుగా చెరువు ఉంది. వార్డుకు చెందిన రైతులు తమ పశువులను అక్కడే శుభ్రం చేయడం, నీళ్లు తాగించడం చేసేవారు. ఇటీవల చెరువు ధ్వంసమైంది. హఠాత్తుగా మొత్తం చెరువును పూడ్చే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారనే అంశం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం చెరువు మత్స్యశాఖ అధీనంలో ఉంది. చెరువు అభివృద్ధికి రూ.25 లక్షలు మంజూరురయ్యాయని చెబుతున్నారు. ఇటీవల కాలువల్లో పూడిక తీసిన మట్టిని తీసుకొచ్చి, చెరువును పూడ్చే ప్రయత్నం చేస్తున్నారు. అక్రమ మార్గంలో రూ.25 లక్షలు దండుకోవడానికి ఇది జరుగుతుందా? లేక చెరువును కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారా? అనే అనుమానాలు వస్తున్నాయి. స్థానిక రైతుల అభిప్రాయం తీసుకోకుండా చెరువు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఊరుకునే ప్రసక్తి లేదని వార్డుకు చెందిన వైఎస్సార్‌సీపీనేతలు బళ్ల తాతాజీ, తోట సుబ్బారావు హెచ్చరించారు.
కాళ్ల: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూముల రీ–సర్వే కార్యక్రమాన్ని ప్రభుత్వ నిబంధనలు, మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా, నాణ్యతతో పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కాళ్ల మండలం కాళ్లకూరు గ్రామ సచివాలయాన్ని శుక్రవారం జాయింట్ కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి, అక్కడ జరుగుతున్న రీ–సర్వే పనులు, భూ హద్దుల నిర్ధారణ, రికార్డుల నమోదు, ప్రజలకు అందిస్తున్న సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రీ–సర్వే రికార్డులను తనిఖీ చేసి, గ్రామ మ్యాప్‌ను పరిశీలిస్తూ సర్వే పురోగతి, భూ వివరాల నమోదుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ భూములు, పోరంబోకు భూముల వివరాలు, వాటి రక్షణకు తీసుకుంటున్న చర్యలపై అధికారుల నుంచి సమగ్ర సమాచారం తెలుసుకున్నారు. గ్రామంలో ప్రతి భూ యజమానికి సంబంధించిన హద్దులు ఖచ్చితంగా నిర్ధారించేలా సర్వే నిర్వహించాలని సూచించారు. సర్వే ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ప్రతి అంశాన్ని నిబంధనల ప్రకారం పరిశీలించాలని, ప్రజలకు పారదర్శక సేవలు అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. రీ–సర్వే సకాలంలో పూర్తి చేయడంతో పాటు, రికార్డుల నమోదు వేగవంతంగా నిర్వహించాలని సూచించారు.


