● విద్యావ్యాపారానికి అడ్డుకట్ట ఎప్పుడు ?
● అనుమతులు లేకుండానే తరగతుల నిర్వహణ
● అక్రమంగా విద్యాసామగ్రి విక్రయాలు
భీమవరం: జిల్లాలో ప్రవేటు విద్యా సంస్థల దందాకు అడ్డుకట్టపడడంలేదు. అనుమతులు లేకుండానే స్కూల్స్ నిర్వహణ, నిబంధనలకు విరుద్ధంగా విద్యాసామగ్రి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. వీటిపై విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నా లెక్కచేసే పరిస్థితి కానరావడం లేదు. జిల్లాలోని 20 మండలాల్లో సుమారు 1,399 ప్రభుత్వ పాఠశాలలుండగా వాటిలో దాదాపు 90 వేలకుపైగా విద్యనభ్యసిస్తున్నారు. దాదాపు 563 ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో లక్షకు పైగా విద్యార్థులున్నారు. జిల్లాలో 15 ప్రభుత్వ జూనియర్ కళాశాలు, రెండు ఎయిడెడ్, రెండు సోషల్ వెల్ఫేర్ కళాశాలలున్నాయి. 82 ప్రైవేట్ కళాశాలలు నిర్వహిస్తుండగా ఈ ఏడాది నూతనంగా దాదాపు 12 జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు చెబుతున్నారు.
12 కొత్త స్కూళ్లకు నాలుగింటికే అనుమతి
జిల్లాలోని వివిధ పట్టణాలు, గ్రామాల్లో ప్రస్తుత విద్యాసంవత్సరంలో నూతనంగా 12 ప్రైవేట్ స్కూల్స్ ఏర్పాటుచేయడానికి ఆయా స్కూల్స్ యాజమాన్యాలు దరఖాస్తు చేయగా కేవలం భీమవరం, ఆకివీడు, నరసాపురం పట్టణాలు, పెనుమంట్ర మండలంలో ఒక్కొక్కటి చొప్పున స్కూళ్లకు అనుమతులు లభించాయి. అలాగే జూనియర్ కళాశాలలు ఒక్కదానికి కూడా అనుమతిలేదని విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. వివిధ ప్రాంతాల్లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న విద్యాసంస్థల యజమానులు విద్యాశాఖకు అనుమతులు కోసం దరఖాస్తు చేసుకుని భవన నిర్మాణాలు ప్రారంభించారు. విద్యాసంవత్సరం ప్రారంభమై 20 రోజులు గడిచిపోతున్నా భవన నిర్మాణాలు పూర్తికాకపోయినా తరగతులు ప్రారంభించడం విశేషం. ఒక పక్క పెద్ద సంఖ్యలో కూలీలు పనిచేస్తుండడం మరొక పక్క యంత్రసామాగ్రి వినియోగిస్తున్నా తరగతులు నిర్వహించడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగే అవకాశముందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.


