పెనుగొండ: సర్ సర్వేపై వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ అడ్వయిజరీ కమిటీ సభ్యుడు చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. శుక్రవారం తూర్పుపాలెంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆచంట, పోడూరు, పెనుగొండ, పెనుమంట్ర మండలాలకు చెందిన బీఎల్‌ఓలతో సమావేశం నిర్వహించారు. బీఎల్‌ఓలతో పాటు ఇంటింటీకి వెళ్లి సర్వే సక్రమంగా జరిగేలా కృషి చేయాలన్నారు. ఏమాత్రం వెనుకంజ వేసినా ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఫలితాలు తారుమారయ్యాయన్నారు. వీటిని అధిగమించడానికి బీఎల్‌ఓలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కూటమి ప్రభుత్వంపై పూర్తి స్థాయి వ్యతిరేకత ఉందన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. ప్రజలను మభ్యపెట్టడానికి కుటిల యత్నాలు చేస్తున్నారని విమర్శించారు. వాటిని తిప్పికొట్టాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. కూటమి పాలనలో అన్నివర్గాలకు అన్యాయం జరిగిందన్నారు. ఎన్నికల్లో ఇబ్బడిముబ్బడిగా హామీలు గుప్పించి మొండిచేయి చూపిందన్నారు. అవినీతి అక్రమాలతో కూటమి పాలన నిండిపోయిందన్నారు. సీఆర్‌జడ్ పరిధిలో తవ్వకాలకు నిషేదం ఉన్నా, కోర్టు ఉత్తర్వులను ధిక్కరించి తవ్వకాలు జరుపుతున్నారని దుయ్యబట్టారు. ఆచంట నియోజకవర్గంలో మట్టి, ఇసుక మాఫియా విలయ తాండవం చేస్తుందన్నారు. అఽధికారులు సైతం వత్తాసు పలకడం దారుణమన్నారు. కోర్టు దిక్కారణ పై హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. అక్రమాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. సమావేశంలో ఆయా మండలాలకు చెందిన నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, బీఎల్‌ఓలు పాల్గొన్నారు.
మాజీ మంత్రి శ్రీరంగనాథరాజు


