ప్రజా సమస్యలపై పోరాటం | - | Sakshi
Sakshi News home page

ప్రజా సమస్యలపై పోరాటం

Jun 26 2026 7:39 AM | Updated on Jun 26 2026 7:39 AM

ప్రజా సమస్యలపై పోరాటం 28న పల్స్‌పోలియో పోగొట్టుకున్న ఫోన్లు రికవరీ రేపు ఆర్జీయూకేటీ ఆరో స్నాతకోత్సవం

భీమవరం: ప్రజా సమస్యలపై సీపీఎం రాజీలేని పోరాటాలకు సిద్ధం కావాలని ఆ పార్టీ రాష్ట్ర సెక్రటేరియట్‌ సభ్యుడు బి బలరామ్‌ చెప్పారు. గురువారం పట్టణంలోని పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో నిర్వహించిన సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు గణనీయంగా తగ్గినా పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరలను తగ్గించకపోవడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మునిసిపల్‌ సంస్కరణలు ప్రజలకు తీవ్ర నష్టం కలిగించేలా ఉన్నాయన్నారు. ఎలక్ట్రికల్‌ బస్సులను ప్రైవేట్‌ రంగానికి అప్పగిస్తే ప్రజారవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలను అరికట్టాలని కోరారు. జేఎన్‌వీ గోపాలన్‌, కేతా గోపాలన్‌, కౌరుపెద్దిరాజు, పీవీ ప్రతాప్‌, కె నాగేశ్వరరావు, బి వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): ఈనెల 28వ తేదీన నిర్వహించనున్న పల్స్‌పోలియో కార్యక్రమాన్ని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని కలెక్టర్‌ చదలవాడ నాగరాణి ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం జిల్లా పల్స్‌ పోలియో టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లాలో మొత్తం ఐదేళ్లలోపు వయసు గల 1,74,756 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడానికి 1,151 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు. కార్యక్రమ నిర్వహణ కోసం 4,518 మంది సిబ్బందికి విధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఏవైనా కారణాల వల్ల పోలియో చుక్కలు వేయించుకోలేని పిల్లలను గుర్తించి, ఈనెల 29, 30 తేదీలలో వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వ్యాక్సిన్‌ అందించాలని ఆదేశించారు. అనంతరం వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. డీఎంహెచ్‌ఓ గీతాబాయి, జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి డాక్టర్‌ దేవ సుధాలక్ష్మి డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ పి.సూర్యనారాయణ, డీపీవో కె.అనురాధ తదితరులు పాల్గొన్నారు.

భీమవరం: ప్రజలు పోగొట్టుకున్న తమ మొబైల్‌ ఫోన్లను గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన సీఈఐఆర్‌ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని భీమవరం వన్‌టౌన్‌ సీఐ ఎ.రమేష్‌ సూచించారు. వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పోయిన 14 మొబైల్‌ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు గురువారం అప్పగించారు. స్థానిక పోలీస్‌ స్టేషన్లలో త్వరితగతిన ఫిర్యాదు నమోదు చేస్తే మొబైల్‌ ఫోన్లను గుర్తించి తిరిగి అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. ప్రజలు తమ మొబైల్‌ ఫోన్‌ ఐఎంఈఓ నంబర్‌ వివరాలను భద్రంగా ఉంచుకోవాలని, అనుమానాస్పద వ్యక్తుల వద్ద నుంచి సెకండ్‌ హ్యాండ్‌ మొబైల్‌ ఫోన్లను కొనుగోలు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సీఈఐఆర్‌ పోర్టల్‌లో చేసుకున్న ఫిర్యాదుల ఆధారంగా భీమవరం వన్‌టౌన్‌ పోలీసులు మొత్తం 14 మొబైల్‌ ఫోన్లను విజయవంతంగా రికవరీ చేసి, సంబంధిత యజమానుల వివరాలను ఽధ్రువీకరించిన అనంతరం వారికి అందజేశారు. భీమవరం వన్‌టౌన్‌ ఎస్సైలు బి.కిరణ్‌కుమార్‌, కృష్ణాజీ, సిబ్బంది పాల్గొన్నారు.

నూజివీడు: రాష్ట్రంలోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) ఆరో స్నాతకోత్సవంను ఈనెల 27న నిర్వహిస్తున్నట్లు ట్రిపుల్‌ఐటీ వర్గాలు తెలిపాయి. నూజివీడు ట్రిపుల్‌ఐటీలోని స్టూడెంట్‌ యాక్టి విటీ సెంటర్‌లో నిర్వహిస్తున్న ఈ స్నాతకోత్సవంలో 2021–22 నుంచి 2024–25 వరకు ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఇంజనీరింగ్‌, ఎంటెక్‌ డిగ్రీలను పూర్తిచేసిన విద్యార్థులకు పట్టాలను అందజేయనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ స్నాతకోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఛాన్సలర్‌ ఆచార్య కొత్తా మధుమూర్తి, వీసీ ఆచార్య మద్దాలి లక్ష్మీనారాయణరావు, నాలుగు ట్రిపుల్‌ఐటీల డైరెక్టర్లు, ఏఓలు, డీన్‌ అకడమిక్స్‌లు, ఆర్జీయూకేటీ రిజిస్ట్రార్‌ తదితరులు పాల్గొననున్నారు. విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement