ఉద్యాన రైతులకు ఉపాధి హామీ తోడ్పాటు | - | Sakshi
Sakshi News home page

ఉద్యాన రైతులకు ఉపాధి హామీ తోడ్పాటు

Jun 26 2026 7:39 AM | Updated on Jun 26 2026 7:39 AM

నరసాపురం రూరల్‌: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఉద్యాన రైతులకు తోడ్పాటు అందిచేందుకు ప్రభుత్వం విస్తృత సహాయం అందిస్తోందని కలెక్టర్‌ చదలవాడ నాగరాణి అన్నారు. గురువారం మొగల్తూరు మండలం రామన్నపాలెంలో పండ్ల తోటల పెంపకం, అభివృద్ధి అవకాశాలపై ఉద్యానశాఖ అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బొమ్మిడి నాయకర్‌తో కలసి కలెక్టర్‌ నాగరాణి ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రైతులు తమ భూముల్లో పండ్ల మొక్కలు నాటి వాటిని సంరక్షించుకోవడం ద్వారా దీర్ఘకాలిక ఆదాయం పొందవచ్చని తెలిపారు. అర్హతల విషయంలో ఎదురవుతున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హామీ ఇచ్చారు. అనంతరం అదే గ్రామంలో నిర్వహించిన ‘రైతన్నా–మీకోసం’ అవగాహన కార్యక్రమంలో కలెక్టర్‌ నాగరాణి పాల్గొని రైతులకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, వ్యవసాయాభివృద్ధి పథకాలపై అవగాహన కల్పించారు.

మొబైల్‌ మెడికల్‌ యూనిట్‌ ద్వారా వైద్యసేవలు

నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం గ్రామంలో ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో గ్రామీణ విద్యుద్దీకరణ సంస్థ (ఆర్‌ఈసీ) సీఎస్‌ఆర్‌ నిధులతో అమలు చేస్తున్న ‘‘మీ ఇంటికి – మీ డాక్టర్‌’’ కార్యక్రమంలో కలెక్టర్‌ నాగరాణి పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఎంపికై న 30 రెడ్‌ క్రాస్‌ బ్రాంచీలలో పశ్చిమగోదావరి జిల్లా ఒకటిగా ఎంపిక కావడం విశేషమన్నారు. మార్చి 23, 2026న ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్‌ను మూడేళ్లపాటు సుమారు రూ.1.30 కోట్ల వ్యయంతో అమలు చేస్తున్నట్లు తెలిపారు. నరసాపురం మండలంలో ఇప్పటివరకు ఐదు పర్యాయాలు మొబైల్‌ మెడికల్‌ యూనిట్‌ పర్యటించి 5,722 మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్‌, కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ కొత్తపల్లి సుబ్బారాయుడు, ఆర్డీవో దాసిరాజు, డ్వామా ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కేసీ అప్పారావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్‌.వెంకటేశ్వరరావు, ఉద్యానవన శాఖ అధికారి ప్రియదర్శిని, ఎంపీడీవో త్రిశూలపాణి, తహశీల్దార్‌ నాగర్జున, ఏఎంసీ చైర్మన్‌ జక్కం శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement