● ముప్పుతిప్పలు పెడుతున్న పెద్దపులి
● పాపికొండల అభయారణ్యంలోకి వెళ్లిన వైనం
● రేపల్లె, రేగులపాడు గ్రామాలవైపు సంచరిస్తున్నట్లు సమాచారం
బుట్టాయగూడెం: గత రెండు రోజులుగా బుట్టాయగూడెం మండలంలో సంచరిస్తున్న పెద్దపులి అటు ఫారెస్ట్ అధికారులు, ఇటు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మండలంలోని పాలకుంట సమీపంలో మంగళవారం రెండు ఆవులపై దాడి చేసిన పెద్దపులి బుధవారం ఒక లేగదూడపై దాడి చేసి చంపింది. పులిని పట్టుకునేందుకు శ్రీశైలం టైగర్ జోన్‌కు చెందిన ప్రత్యేక టీమ్ బెంగుళూరు, వైజాగ్‌కు చెందిన ప్రత్యేక నిపుణుల బృందాలు మంగళవారం రాత్రి పాలకుంట సమీపంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజామున 2 గంటల సమయంలో ప్రత్యేక బృందాలు ఊహించిన ప్రదేశానికి పెద్దపులి వచ్చి ఒక లేగదూడపై దాడి చేసి చంపి మళ్లీ తప్పించుకుని వెళ్లినట్లు అధికారులు తెలిపారు. పుల్లి చిక్కినట్టే చిక్కి మళ్లీ చేజారిపోవడంతో అటవీశాఖ అధికారులు తీవ్ర నిరాశ చెందారు. ఉదయం నుంచి పులి కదలికల కోసం అటవీశాఖ అధికారులు ప్రయత్నాలు చేశారు. పాలకుంట సమీపంలోని సింగారమ్మకొండ మీద నుంచి దండిపూడి మీదుగా పాపికొండల అభయారణ్యంలోని రేగులపాడు, రేపల్లె, తదితర ప్రాంతాల్లో వెళ్లిందని భావించి డ్రోన్ కెమెరాలతో వెతికారు. దట్టమైన అరణ్యం, ఎత్తయిన కొండలు ఉండడంతో పులికి అమర్చిన రేడియో కాలర్ సిగ్నల్ అందడంలేదని అధికారులు తెలిపారు. అందుకనే డ్రోన్‌లతో సెర్స్ చేస్తున్నట్లు చెప్పారు. రాత్రి 8 గంటల వరకూ అటవీశాఖ అధికారులు రేపల్లె, రేగులపాడు, పరిసర ప్రాంతాల్లో పులి బోనులు సిద్ధం చేసి ఉంచారు. మధ్యాహ్నం 3:30 గంటలకు పులికి అమర్చిన రేడియో కాలర్ ద్వారా ప్రత్యేక బృందాలకు సిగ్నల్ అందినప్పటికీ తదుపరి పులి సంచారం ఎక్కడా కనిపించలేదని అధికారులు తెలిపారు. దట్టమైన అటవీ ప్రాంతంతోపాటు వాతావరణంలో కూడా మార్పులు రావడంతో సిగ్నల్ కష్టంగా మారిందని తెలిపారు. తదుపరి రేపల్లి, రేగులపాడులో పులి సంచరిస్తున్నట్లు భావిస్తున్నామని చెప్పారు.


