భీమవరం (ప్రకాశంచౌక్): ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారిస్తోందని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్‌కుమార్ రెడ్డి తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్‌లో ఆక్వా ఫీడ్ డీలర్స్ అసోసియేషన్, ఆక్వా ఫార్మర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, ఆక్వా రైతులతో కలిసి రొయ్యల మేత ధరలు, ఆక్వా రంగంలో ఎదురవుతున్న సమస్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలను జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై జేసీ స్పందిస్తూ ఆక్వా ఫీడ్ ధరలు, రొయ్యల కొనుగోలు ధరల అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిందని, ఆ కమిటీ సూచనలు, సిఫార్సుల మేరకు తగిన నిర్ణయాలు తీసుకునే ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్, ఆక్వా ఫీడ్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటరామరాజు, ఆక్వా ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తులసి రాంబాబు, ఆక్వా డీలర్లు, రైతులు పాల్గొన్నారు.


