త్యాగానికి ప్రతీక మొహర్రం | - | Sakshi
Sakshi News home page

త్యాగానికి ప్రతీక మొహర్రం

Jun 26 2026 7:27 AM | Updated on Jun 26 2026 7:27 AM

త్యాగానికి ప్రతీక మొహర్రం

సర్వమత సామరస్యానికి ప్రతీక

నేడు భారీ ఊరేగింపు.. పీర్ల నిమజ్జనంతో ముగింపు

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): అమరవీరుల సంస్మరణార్థం (షహీద్‌) భక్తిశ్రద్ధలతో నిర్వహించే మొహర్రం నెల ఈ నెల 16 నుంచి ప్రారంభమైంది. ముస్లింల విశ్వాసం ప్రకారం ఇదే రోజున ఇస్లాం నూతన సంవత్సరం కూడా మొదలవుతుంది. అయితే, మొహర్రంను వారు పండుగలా కాకుండా, వర్ధంతిగా అత్యంత పవిత్రంగా భావిస్తారు. ప్రజలంతా సోదరభావంతో, సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుతూ ఈ వేడుకలు నిర్వహిస్తుంటారు. నగరంలో గత కొన్ని దశాబ్దాలుగా ఎంపిక చేసిన పంజాల్లోనే ఈ వేడుకలు సాగుతున్నాయి. గత ఏడాది నగరవ్యాప్తంగా దాదాపు 15 పంజాల్లో ప్రార్థనలు జరగ్గా, ఈ ఏడాది నిధుల లేమి కారణంగా కేవలం 7 పంజాల్లో మాత్రమే పీర్లను నిలిపి, ఏర్పాట్లు చేశారు.

భక్తిశ్రద్ధలతో పీర్ల ప్రతిష్ఠ

మొహర్రం సందర్భంగా నగరంలోని వివిధ ఆస్థానాల్లో పీర్లను ప్రతిష్ఠించారు. అప్పటివరకు పెట్టెల్లో భద్రపరిచిన వెండి, ఇత్తడి తదితర లోహాలతో చేసిన పీర్లను బయటకు తీసి, వాటికి మెరుగులు దిద్ది, పూలతో సుందరంగా అలంకరించారు. ఈ నెల 16న కుండీ సెంటర్‌లోని గొలుసుల పంజాతో పాటు, పోణంగి రోడ్డులోని ఖాదర్‌బాబా ఇమామ్‌ ఏ ఖాసిం ఆస్థానాల్లో ప్రతిష్ఠాపన మహోత్సవం నిర్వహించారు. కొన్ని ఆస్థానాల్లో ఐదు రోజుల పాటు పీర్లను కొలువుదీర్చారు. నాటి నుంచి భక్తులు నిత్యం పీర్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. సంతానం లేని హిందూ, ముస్లిం భక్తులు ఇక్కడికి వచ్చి పూల అలంకరణ చేసి.. మరమరాలు, అటుకులు, శెనగపప్పు, బూందీ ప్రసాదాలను నైవేద్యంగా సమర్పిస్తున్నారు. కోరికలు నెరవేరిన వారు మహాత్ముల పీర్లకు వెండి ఊయలలు, హస్తాలను కానుకలుగా సమర్పిస్తుండటం ఇక్కడి ప్రత్యేకత.

పవిత్రంగా అగ్నిగుండం ప్రవేశం

మొహర్రం వేడుకల్లో అగ్నిగుండం తొక్కే కార్యక్రమాన్ని పవిత్రమైనదిగా భావిస్తారు. ఎంతోమంది భక్తులు నిష్టతో ఈ నిప్పుల గుండంలో నడుస్తారు. నగరంలోని గన్‌బజారు జల్‌జలా సాహెబ్‌ ఆస్థాన, పోణంగిలోని మౌలాలి ఆస్థానాల్లో ప్రతిఏటా ఈ కార్యక్రమం నిర్వహిస్తుంటారు. మొహర్రం నెల ప్రారంభమైన 7వ, 9వ రోజుల్లో ఈ అగ్నిగుండాల కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో పూర్తి చేశారు.

7 ఆస్థానాల్లో నిత్య ప్రార్థనలు

ఏలూరు పరిసర ప్రాంతాల్లోని 7 ఆస్థానాల్లో మొహర్రం వేడుకల్లో భాగంగా నిత్యం ప్రత్యేక ప్రార్థనలు, దరూదె సలాం, ఫాతెహా ఖానీ నిర్వహిస్తున్నారు. స్థానిక కుండీ సెంటర్‌లోని మౌలా అలి ముష్కిల్‌ కుష ఆస్థాన (గొలుసుల పంజా), గన్‌బజారులోని జల్‌జలా సాహెబ్‌ ఆస్థాన, శనగపప్పు బజారులోని ఇమామ్‌ ఏ ఖాసిం పంజా, చేపల చెట్టు సెంటర్‌లోని సింగ మహల్లా పంజా, గడియార స్తంభం వద్ద ఉన్న బీబీ ఫాతిమా రజియా అల్లా పంజా, పోణంగిలోని గాజుల పంజా, తంగెళ్లమూడి బీడీ కాలనీ ఏటిగట్టుపై ఉన్న అలీ తల్వార్‌ (ఏడు కాలువల సెంటర్‌) పంజాల్లో ఈ ప్రత్యేక ప్రార్థనలు సాగుతున్నాయి.

శాంతియుత ఇస్లాం ధర్మ స్థాపన కోసం కర్బలా యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన మహమ్మద్‌ ప్రవక్త మనుమడు హజరత్‌ ఇమామ్‌ ఎ.హుస్సేన్‌ను స్మరిస్తూ ఈ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. దాదాపు అన్ని పంజాల్లో ముస్లింలతో పాటు హిందువులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రార్థనలు చేయడం ఏలూరు మొహర్రం విశిష్టత.

– ఎండీ గాలబ్‌ అలీ, ముజావరు, గొలుసుల పంజా

ఏలూరు నగర పరిసర ప్రాంతాల్లో ప్రతిష్ఠించిన పీర్ల నిమజ్జనంతో ఈ వేడుకలు ముగియనున్నాయి. మొహర్రం నెల 11వ రోజైన శుక్రవారం నిమజ్జనం నిర్వహించేందుకు పీర్ల పంజా కమిటీ భారీ ఏర్పాట్లు చేసింది. మధ్యాహ్నం నుంచి ఆయా ప్రాంతాల పీర్లను విశేషంగా అలంకరించి స్థానిక కుండీ సెంటర్‌లోని గొలుసుల పంజా వద్దకు తీసుకువస్తారు. అక్కడి నుంచి భారీ ఊరేగింపుగా నగర వీధుల గుండా ప్రదర్శన సాగుతుంది. సాయంత్రానికి ఈ శోభాయాత్ర పాత బస్టాండు వద్ద ఉన్న కర్బలా మైదానానికి చేరుకుంటుంది. అనంతరం అక్కడి పవిత్ర బావిలో పీర్లను నిమజ్జనం చేయడంతో వేడుకలు ముగుస్తాయి.

ప్రతిఏటా మొక్కులు తీర్చుకునే హిందూ, ముస్లింలు

పవిత్ర కార్యంగా అగ్నిగుండం తొక్కే కార్యక్రమం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement