జాగ్రత్తలే కీలకం
● పొలాల్లో పొంచి ఉన్న ప్రమాదాలు
● అప్రమత్తతే రక్షణ
● పాము కాటుకు గురైన వారు ఆందోళన చెందకూడదు. తీవ్రమైన ఒత్తిడికి గురైతే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది.
● పాము కాటువేయగానే గాయాల పైభాగంలో కట్టుకట్టాలి. కొత్త బ్లేడుతో కాటు వేసిన చోట కొద్దిగా చర్మాన్ని తొలగించి రక్తాన్ని నోటితో లాగివేయాలి. నోట్లో గాయాలు ఉన్నవారు ఇలా చేయకూడదు.
● ఏ పాము కాటు వేసిందో తెలుసుకొని యాంటీ వీనమ్(విషానికి విరుగుడు) తీసుకుంటే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు.
● రైతులు రాత్రిపూట పొలాలకు వెళ్లేప్పుడు కాళ్లకు చెప్పులు, టార్చిలైట్లతో పాటు శబ్ధాలు చేసే పరికరాన్ని వెంట తీసుకొని వెళ్లడం వల్ల పాముకాటు నుంచి రక్షించుకోవచ్చు అని వైద్యులు సూచిస్తున్నారు.
బుట్టాయగూడెం: వర్షాకాలం ప్రారంభమైంది. అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. ఈ కాలంలో పాములు ఎక్కడ పడితే అక్కడ సంచరిస్తూ కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా అటవీ ప్రాంతంలోని సరిహద్దు గ్రామాల్లో, దట్టమైన పొదల సమీపంలో పాములు తరచూ కనిపిస్తూనే ఉంటాయి. రైతులు పొలాలకు నీరు పెట్టేందుకు వ్యవసాయ పనులకు వెళ్తుంటారు. ఈ సమయంలో అప్రమత్తంగా లేకపోతే పాముల రూపంలో కాలయముడు కాచుకొని ఉంటాడని ఆచి తూచి అడుగులు వేయాలంటూ వైద్యులు చెప్తున్నారు. పోలవరం నియోజకవర్గంలోని వేలేరుపాడు, కుక్కునూరు, పోలవరం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో గల ప్రభుత్వాస్పత్రుల్లో పాము కాటు కేసులు ప్రతి ఏటా వర్షా కాలంలో అధికంగా నమోదవుతున్నాయి. ఇటీవల బుట్టాయగూడెం మండలంలో పాముకాటుకు గురై మృతి చెందిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. అదేవిధంగా మండ్రకప్ప, తేలు కాటుకు గురై పలువురు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఏటా జూన్ నుంచి సెప్టెంబర్ వరకూ పాములు, ఇతర విష కీటకాల బెడద ఉంటుంది. వీటి బారిన పడకుండా తప్పించుకోవడానికి అప్రమత్తతే ప్రధానమని వైద్యులు తెలుపుతున్నారు.
అన్ని పాముల వల్ల ప్రమాదం లేదు
మనకు కనిపించే అన్ని పాములు విషపూరితం కాదని వైద్య నిపుణులు అంటున్నారు. నాగుపాము, కట్లపాము, రక్తపింజర వంటి పాముల వల్లనే ప్రమాదం ఉందని చెబుతున్నారు. సాధారణంగా 50 శాతంపైగా పాముల వల్ల ఎటువంటి ప్రమాదం ఉండదని వైద్యులు చెబుతున్నారు. పాము కాటువేసిన వెంటనే సకాలంలో వైద్యం చేయించుకుంటే ఎటువంటి సమస్య ఉండదని అంటున్నారు.
రక్తపింజర
ఇది ఎక్కువగా అటవీప్రాంతంలో తిరుగుతూ ఉంటుంది. ఈ పాము కాటు వేస్తే 2 గంటల తర్వాత విషం శరీరానికి ఎక్కుతుంది. వెంటనే అందుబాటులో ఉన్న ప్రాథమిక ఆస్పత్రికి తీసుకువెళ్లి వైద్యం అందించాలి. వైద్యుల పర్యవేక్షణలో పాము కాటుకు గురైన వ్యక్తిని ఉంచాలి.
నాగుపాము
నాగుపాము అనేది అత్యంత ప్రమాదకరమైనది. ఈ పాము కాటువేస్తే 15 నిమిషాల్లోనే విషం తీవ్రంగా ఎక్కుతుంది. ముందుగా పాముకాటు వేసిన చోట గాయాన్ని తొలగించి, వెంటనే ఆ వ్యక్తిని ఆస్పత్రికి తరలించాలి. నాగుపాము విషం ప్రధానంగా నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
కట్లపాము
కట్లపాము కాటువేసిన వెంటనే విషం రక్తంలో కలుస్తుంది. ప్రాణాపాయం ఎక్కువ. పాము కాటు వేసిన వెంటనే ఆస్పత్రిలో చేర్పించి వైద్యం చేయించాలి. కట్లపాము విషం రక్తంలోకి చేరకముందే వైద్యం చేయిస్తే ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు.
రక్త పింజర
కట్లపాము
వర్షాకాలంలో రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పొలాల్లోకి నీరు చేరడంతో పాములు, తేళ్లు, విష సర్పాలు, కీటకాలు బయటకు వచ్చి ప్రమాదంగా మారతాయి. పొలాలకు వెళ్లే రైతులు తప్పనిసరిగా ఖచ్చిమైన జాగ్రత్తలు తీసుకోవాలి. కలుపు తీసే సమయంలో, గడ్డి కోసే సమయంలో నేరుగా చేతులు పెట్టకుండా కర్రలు ఉపయోగించుకోవాలి. ఎవరైనా పాము కాటుకు గురైతే వెంటనే సమీపం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి సకాలంలో వైద్య సేవలు పొందాలి.
– డాక్టర్ జె. సురేష్, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ, కేఆర్‌పురం, బుట్టాయగూడెం మండలం


