టి.నరసాపురం: మండలంలోని బొర్రంపాలెం నుంచి వీరభద్రవరం వెళ్లే రహదారిలో గురువారం జంగారెడ్డిగూడేనికి చెందిన ప్రైవేట్ స్కూల్ బస్సు ముందు టైరు ఊడిపోయింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జంగారెడ్డిగూడెంకు చెందిన ప్రైవేట్ స్కూల్ బస్సు మండలంలో బొర్రంపాలెం, వీరభద్రవరం, వెలగపాడు తదితర గ్రామాల నుంచి విద్యార్థులను ప్రతిరోజూ జంగారెడ్డిగూడెం తీసుకెళ్లి, తీసుకొస్తోంది. గురువారం యథావిధిగా విద్యార్థులను తీసుకుని వెళుతుండగా ప్రయాణం మధ్యలో బస్సుకున్న ముందు టైరు ఊడిపోయింది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో సుమారు 30 మీటర్ల దూరం వెళ్లి ఆగిపోయింది. దీంతో విద్యార్థులు, స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఫిట్ నెస్ లేని బస్సులపై అధికారులు పర్యవేక్షించాలని పలువురు కోరుతున్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరు జిల్లా అదనపు పోలీస్ సూపరింటెండెంట్ (అడ్మిన్)గా వై.ప్రసాదరావు గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అధికారికంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన ఎస్పీ కే.ప్రతాప్ శివకిషోర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. జిల్లా పోలీసు కార్యాలయ ఏఓ షేక్ మస్తాన్, ఆఫీస్ సూపరింటెండెంట్ నాగేశ్వరరావు, సువర్చల, సిబ్బంది ఏఆర్ ఆర్‌ఐ పవన్ కుమార్, పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రసాదరావుకు శుభాకాంక్షలు తెలిపారు.
తాడేపల్లిగూడెం (టీఓసీ): తాడేపల్లిగూడెం–బాదంపూడి రైల్వే స్టేషన్‌ల మధ్య సుమారు 50 నుంచి 60 సంవత్సరాలు వయస్సు గల గుర్తు తెలియని వృద్ధురాలిను (ఆడవ్యక్తి)ని ఓ గుర్తు తెలియని రైలు బండి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వృద్ధురాలి మృతదేహం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. సుమారు 5 అడుగులు ఎత్తు, చామన ఛాయ, పచ్చరంగు జాకెట్, పచ్చ, ఎరుపు, నలుపు రంగు డిజైన్ కలిగి కాటన్ చీర ధరించిన మహిళగా గుర్తించామని రైల్వే పోలీసులు తెలిపారు. ఈ మేరకు జీఆర్‌పీ ఆర్‌పీ ఎస్‌ఐ పి.అప్పారావు, హెచ్‌సీ డి.వెంకటేశ్వరరావులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. పల్స్‌పోలియో ఏర్పాట్లపై రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపాల్ కార్యదర్శి ఎస్.సురేష్‌కుమార్ కలెక్టర్లతో గురువారం జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో 1,80,575 మంది ఐదేళ్లలోపు వయసున్న పిల్లల కోసం 2.52 లక్షల డోసులు సిద్ధం చేశామన్నారు. 28న 1094 బూత్‌ల ద్వారా, 29, 30 తేదీల్లో ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేస్తామన్నారు.
అత్తిలి: మండలంలోని ఈడూరులో ఉన్న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవరాల వేకజటేశ్వరస్వామివారి కల్యాణం గురువారం నేత్రపర్వంగా సాగింది. ముందుగా శ్రీ స్వామి, అమ్మవార్లను గజవాహనంపై ఉంచి గజవాహన సేవ నిర్వహించారు. సుదర్శన సాయిరామాచార్యులు ఆధ్వర్యంలో వాడపల్లి శేఖరాచార్యులు, విఖన్‌బాబు, తదితర వేదపండితుల సమక్షంలో స్వామి వారి కల్యాణం నిర్వహించారు. ఈ కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఆలయ ప్రాంగణంలో చేసి హరే శ్రీనివాస కోలాట ప్రదర్శన ఆకట్టుకుంది అనంతరం ఆలయ ప్రాంగణంలో అఖండ అన్నసమారాధన నిర్వహించారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లను పుష్పాలతో అలంకరించిన రథంపై ఉంచి రథోత్సవం వైభవంగా చేశారు.
ముదినేపల్లిలో
భారీ వర్షపాతం
ముదినేపల్లి(కైకలూరు): నియోజకవర్గంలో కొద్ది రోజులుగా భారీ వర్షాపాతం నమోదవుతుంది. బుధవారం రాత్రి ముదినేపల్లి మండలంలో జిల్లాలోనే అత్యధికంగా 35.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కై కలూరు మండలంలో 29.2, మండవల్లిలో 24.6 మిల్లీమీటర్లుగా నమోదైంది. జిల్లా మొత్తం మీద వర్షపాతం 196.2 మిల్లీమీటర్లుగా ఉందని అధికారులు తెలిపారు.


