దళిత క్రైస్తవులను దళితులుగా గుర్తించాలి | - | Sakshi
Sakshi News home page

దళిత క్రైస్తవులను దళితులుగా గుర్తించాలి

Jun 2 2026 5:59 AM | Updated on Jun 2 2026 5:59 AM

సాక్షి, భీమవరం: దళిత క్రైస్తవులను దళితులుగా గుర్తించి, దళితవాడలను పంచాయతీలుగా అభివృద్ధి చేసిన వారికే రానున్న రోజుల్లో మద్దతు తెలపాలని దళితులకు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీవీ సునీల్‌కుమార్‌ పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక బేతని గరల్స్‌ హైస్కూల్‌ గ్రౌండ్‌లో దళిత క్రైస్తవ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సునీల్‌కుమార్‌ మాట్లాడుతూ ఎవరినో కించపర్చేందుకో, విమర్శించేందుకో భీమవరంలో సభను ఏర్పాటుచేయలేదని, రాష్ట్రవ్యాప్తంగా దళిత క్రైస్తవుల్లో ధైర్యం నింపేందుకు దళితులపై ఎక్కడ దాడి జరిగిందో, ఎక్కడ దళితులు ఆత్మరక్షణ కోసం పరుగులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందో ఆ గడ్డమీదనే ఏర్పాటుచేశామన్నారు. సమావేశం నిర్వహణకు ఆటంకాలు కల్పించినా న్యాయస్థానం నుంచి అనుమతి తెచ్చుకున్నామన్నారు. పదేళ్లుగా ఉద్యోగాన్ని పణంగా పెట్టి దళితుల అభివృద్ధి కోసం పోరాటం చేస్తున్నానని వివరించారు. దళితవాడ పంచాయతీల వలన రాష్ట్రంలో నాలుగు వేల పంచాయతీలు వస్తాయని, నాలుగు వేల మంది సర్పంచులు, ఉపసర్పంచులు, 20 వేల మంది వార్డు సభ్యులు ఉంటారన్నారు. ఏటా ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు రూ.20 వేల కోట్ల నుంచి రూ.8 వేల కోట్లు వస్తే దళిత వాడలు మనమే బాగు చేసుకునే వీలుంటుందన్నారు. ఆకివీడు పెదపేట వంటి ఘటనలకు ఆస్కారం ఉండదని, దాని కోసమే పో రాటం చేస్తున్నట్టు సునీల్‌కుమార్‌ తెలిపారు. ఇప్పటికే మాజీ సీఎం జగన్‌ మాట ఇచ్చారని, తనకు తెలిసి కూటమి ప్రభుత్వం పరిశీలనలోనూ ఈ అంశం ఉందన్నారు. సీఎం చంద్రబాబును కలిసి వినతిపత్రం అందజేయనున్నట్టు తెలిపారు. క్రైస్తవ సమాజం భయంలో ఉందని, ఇటీవల తన తండ్రి చనిపోతే వారిలో ధైర్యం నిపేందుకు ఆయన్ని సమాధి చేస్తున్న దృశ్యాలను లైవ్‌లో చూపించానన్నారు. ఎవరైనా వచ్చి ఫొటోలు తీసి తన క్యాస్ట్‌ క్యాన్సిల్‌ చేసుకొమ్మని సవాల్‌ చేశారు. క్రైస్తవుడిని ఏ విధంగా గుర్తించాలనే విషయాన్ని సుప్రీంకోర్టు ఎక్కడా చెప్పలేదని, బాప్టిజం తీసుకున్న వారు మాత్రమే క్రైస్తవులుగా మారతారని హైకోర్టు స్పష్టం చేసిందన్నారు. రాష్ట్రంలోని తహసీల్దార్లు, ఆర్డీఓలు, కలెక్టర్లకు ప్రత్యేక క్లాసులు పెట్టి క్యాస్ట్‌ సర్టిఫికెట్‌కు ప్రాతిపదిక ఏమిటనేది తెలియజేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్టు సునీల్‌కుమార్‌ తెలిపారు.

యూట్యూబర్‌ అవతారమెత్తారు

ఐపీఎస్‌ అధికారి సునీల్‌కుమార్‌ దెబ్బకు ఈ ప్రాంతానికి చెందిన ఒకరు యూట్యూబర్‌గా మారిపోయారంటూ నేషనల్‌ క్రిస్టియన్‌ చైర్మన్‌ జాన్‌మాస్క్‌ ఎద్దేవా చేశారు. బ్యాంకులకు కన్నం పెట్టిన ఘనుడని, క్రిస్టియన్‌ ఆస్పత్రిలో పుట్టి ఇప్పుడు అదే ఆస్పత్రిని లేపేయ్యాలని చూస్తున్నారని విమర్శించారు. ఐక్య వేదిక నాయకుడు రేమల్లి కమల్‌రాజు అధ్యక్షతన జ రిగిన సభలో సంఘ నాయకులు మేడిద జాన్సన్‌, జి.రాజేష్‌కన్నా, చిగురుపాటి సందీప్‌, జి.సుందరకుమార్‌ తదితరులు మాట్లాడారు. వై.న్యూటన్‌, కోనాల జోసఫ్‌, యు.కరుణాకర్‌, కె.స్టాన్లీరాజు, బి.రమేష్‌బాబు, డి.అశోక్‌, ఎం.ఎస్తేర్‌రాజు, బి.విజయరాజు, పి.వరప్రసాద్‌, సీహెచ్‌ కమల్‌హాసన్‌, వేలాదిగా దళిత క్రైస్తవులు పాల్గొన్నారు.

దళిత క్రైస్తవుల ఐక్యవేదికలో ఐపీఎస్‌ అధికారి సునీల్‌కుమార్‌ పిలుపు

Advertisement
 
Advertisement
Advertisement