కదలని బేళ్లు.. రైతుల కన్నీళ్లు | - | Sakshi
Sakshi News home page

కదలని బేళ్లు.. రైతుల కన్నీళ్లు

Jun 1 2026 1:02 AM | Updated on Jun 1 2026 1:02 AM

బుట్టాయగూడెం: పొగాకు పగాకుగా మారిపోయింది. ఈ ఏడాది ధర దారుణంగా పడిపోయింది. ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. కనీసం పెట్టుబడి ఖర్చులైనా దక్కితే చాలన్న దీనస్థితిలో ఆశగా ఎదురుచూస్తున్నారు. గతేడాది గరిష్టంగా రూ.450 వరకూ ధర పలికింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి రూ.265కు మించి లేదు. దీంతో రైతులు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు. ఒక వైపు ప్రకృతి వైపరీత్యాలు, మరో వైపు వాతావరణ పరిస్థితులు వీటి తో పాటు అధిక పెట్టుబడులు వెరసి పొగాకు రైతులను మనోవేదనకు గురి చేస్తున్నాయి. రాత్రింబవళ్లు కష్టపడి పనిచేయడంతో పాటు వేలకు వేలు పెట్టుబడులు పెట్టి సాగు చేస్తున్న రైతులకు సరైన మద్దతు ధర లేకపోవడంతో నష్టాలు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

గతేడాది గరిష్ట ధర కి లోకు.. రూ.450

ఏజెన్సీ, మెట్ట ప్రాంతంలో గల తేలిక నేలల్లో (ఎన్‌ఎల్‌ఎస్‌)లో ఈ ఏడాది సుమారు 29.074 హెక్టార్లలో పొగాకు సాగు జరిగినట్టు బోర్డు అధికారులు తెలిపారు. 80 మిలియన్‌ కిలోల వరకూ దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని జంగారెడ్డిగూడెం వేలం కేంద్రం–1,2, గోపాలపురం, దేవరపల్లి, కొయ్యలగూడెం కేంద్రాల పరిధిలో 12,012 మంది రైతులు 13,864 బ్యారన్లను రిజిస్ట్రేషన్‌ చేసుకుని ఆయా బేరన్ల పరిధిలో సుమారు 22,194 హెక్టార్లలో వర్జీనియా పొగాకును సాగుచేస్తున్నారని అధికారులు తెలిపారు. అయితే గతేడాది కిలో పొగాకు ధర సుమారు రూ.450 పలకగా ఈ ఏడాది రూ.265 దాటి ధర పలకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం రూ.360 ధర పలికితే గానీ తాము పెట్టిన పెట్టుబడుల నుంచి బయటపడగలమని రైతులు వాపోతున్నారు.

గత ప్రభుత్వంలో గిట్టుబాటు ధరలు

గత వైఎస్సార్‌సీపీ పాలన సమయంలో పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు లభించాయి. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించి రైతులకు అండగా నిలిచింది. రైతుల దగ్గర నుంచి పొగాకు కొనుగోలు చేసి గిట్టుబాటు ధరలు కల్పించడంతో రైతులు కష్టాల నుంచి గట్టెక్కారు. మార్కెట్‌లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పోటీతత్వం పెరగడంతో రైతులు లాభాలబాట పట్టారు. ఆనాడు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అండగా నిలిచిన విధానాన్ని ఇప్పుడు రైతులు గుర్తు చేసుకుంటున్నారు.

పెరిగిన సాగు ఖర్చులు

ఈ ఏడాది పొగాకుకు మంచి ధర వస్తుందనే ఆశతో రైతులు సాగు చేపట్టారు. అయితే 22,194 హెక్టార్లలో రైతులు సాగుచేయగా 48.75 మిలియన్‌ కేజీల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశా రు. ఆ మేరకే పొగాకు కొనుగోలుకు బోర్డు కూడా అనుమతించింది. అయితే రైతులు మాత్రం అనధికారికంగా 7 వేల హెక్టార్లలో సాగు చేసినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ ఏడాది కౌలు, పెట్టుబడులు, భారీగా పెరిగాయని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం కిలో రూ.265 కొనుగోలు చేస్తే కనీసం అప్పులు కూడా తీరే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కర్షకుల పాలిట పగాకు

రైతులకు దక్కని గిట్టుబాటు ధరలు

ఇల్లు కదలని బేళ్లు

సాగు ఖర్చు పెరగ్గా.. తగ్గిన ఆదాయం

ప్రస్తుత కొనుగోలు ధర రూ. 265

కిలోకు రూ.360 వస్తేనే గానీ గిట్టుబాటు కాదంటున్న రైతులు

Advertisement
 
Advertisement
Advertisement