ఉంగుటూరు: ఉంగుటూరు మండలంలోని మెట్టప్రాంత చెరువుల్లో మట్టి, కంకర తవ్వకాలు గత 15 రోజులుగా ఎలాంటి అనుమతులు లేకుండా ఇబ్బడిముడిగా సాగుతున్నాయి. జేసీబీలు, పొక్లెయిన్లతో భూమిని తవ్వేస్తూ రాత్రింబవళ్లు వందలాది లారీలు, ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, మెరక పనులకు వీటిని అమ్ముకుంటూ లక్షల రూపాయలు జేబులు నింపుకుంటున్నారు. గ్రామాల్లో వందలాది ట్రాక్టర్లు తిరగటంతో రేగుతున్న దుమ్మూధూళి వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
‘యర్రచెరువు’లో భయానక పరిస్థితి
ఉంగుటూరు యర్రచెరువులో మట్టి, కంకరను రాత్రింబవళ్లు యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. ఇష్టానుసారంగా భారీ గోతులు తీస్తుండటంతో పర్యావరణం దెబ్బతినేంతగా ఇక్కడి పరిస్థితి భయానకంగా మారింది. ఈ కంకరను జిల్లాలోని పలు ప్రాంతాలకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలిస్తున్నారు. నియోజకవర్గ ప్రజాప్రతినిధి ముఖ్య అనుచరుడే ఈ తవ్వకాలను వెనుక ఉండి నడిపిస్తున్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది.
నీలాద్రిపురం ‘అబ్బినీడి చెరువు’లో
మెరకల దోపిడీ
నీలాద్రిపురం దగ్గర ఉన్న అబ్బినీడి చెరువులో గత పదిహేను రోజులుగా తవ్వకాలు సాగుతున్నాయి. ఈ మట్టిని వివిధ లేఅవుట్లు, నిర్మాణాల మెరక పనుల కోసం అమ్ముకుంటున్నారు. ఒక అధికార కూటమి నాయకుడే ఈ చెరువును తవ్విస్తున్నట్లు సమాచారం.
వెల్లమిల్లి ‘పెండ్లికొడుకు చెరువు’లో
తవ్వకాల జాతర
వెల్లమిల్లి పెండ్లికొడుకు చెరువులో వారం రోజులుగా ట్రాక్టర్లు, మిషన్ల శబ్దాలతో ఒక జాతరను తలపించేలా కోలాహలం కనిపిస్తోంది. స్థానిక కూటమి నాయకుల కనుసన్నల్లోనే ఈ పనులు జరుగుతున్నాయి. ఇక్కడి మట్టిని లోకల్‌గానే కాకుండా తాడేపల్లిగూడెం మండలంలోని పలు ప్రాంతాలకు మెరక పనుల కోసం తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
నాచుగుంటలో ‘అనుమతుల’ ముసుగులో..
నాచుగుంటలోని అబ్బినీడి చెరువును తవ్వి మట్టిని బయటకు తరలిస్తున్నారు. స్థానిక కూటమి నాయకుడి ఆధ్వర్యంలో ఈ పనులు జోరుగా సాగుతున్నాయి. అయితే తాము మైనర్ ఇరిగేషన్ అధికారుల నుంచి అనుమతి పొందామని వారు చెబుతున్నప్పటికీ, అది ఎంతవరకు నిజమనేది అధికారులకే తెలియాలి.
యర్రమళ్ల ‘తోటాడి చెరువు’లో
సొంత తవ్వకాలు
యర్రమళ్ల గ్రామాన్ని ఆనుకుని ఉన్న తోటాడి చెరువులో మట్టి దోపిడీ సాగుతోంది. స్థానిక టీడీపీ నాయకుడి ఆధ్వర్యంలో మట్టిని తవ్వి పొలాలకు, గ్రామాల్లో మెరక పనులకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
ఇతర గ్రామాల్లోనూ అదే బాట..
ఇవే కాకుండా మండలంలోని బాదంపూడి, గోపినాథపట్నం, తిమ్మయ్యపాలెం, యర్రమిల్లిపాడు, గోపాలపురం, రామచంద్రపురం తదితర గ్రామాల ఆయకట్టు చెరువుల్లోనూ అక్రమ తవ్వకాలు సాగుతున్నాయి. ఎ.గోకవరం చెరువులో, నల్లమాడు ‘సుద్దగుంట చెరువు’లో కూడా స్థానిక నాయకుల కనుసన్నల్లోనే అప్పుడప్పుడు తవ్వకాలు జరుపుతున్నారు.
కోట్లలో ప్రభుత్వ ఆదాయానికి గండి!
ఈ విధంగా మెట్టప్రాంతంలోని ప్రతీ గ్రామంలో తవ్వకం పనులు జోరుగా సాగుతున్నా.. రెవెన్యూ, మైనర్ ఇరిగేషన్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతల కనుసన్నల్లోనే ఈ పనులు జరుగుతుండటంతో అధికారులు నోరు మెదపడం లేదు. ఈ అక్రమ భూమార్పిడి వల్ల ప్రభుత్వానికి ‘సీనరేజ్’ రూపంలో రావాల్సిన కోట్ల రూపాయల ఆదాయానికి గండి పడుతోంది. ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన సొమ్ము.. అక్రమార్కుల జేబుల్లోకి వెళ్తోందని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.
రాత్రింబవళ్లు యథేచ్ఛగా మట్టి, కంకర అక్రమ తవ్వకాలు
కూటమి నేతలకు కాసుల పంట
చెరువులను గుల్లచేస్తూ పర్యావరణానికి హాని


