తీరంలో అనధికార గరికట్లు | - | Sakshi
Sakshi News home page

తీరంలో అనధికార గరికట్లు

Jun 1 2026 1:02 AM | Updated on Jun 1 2026 1:02 AM

మత్స్యకారుల పొట్ట కొడుతున్నారు

పట్టించుకోవడం లేదు

నరసాపురం: నరసాపురం తీరగ్రామాల్లో గరికట్ల దోపిడీ యథేచ్ఛగా సాగుతుంది. కొన్ని గ్రామాల్లోని టీడీపీ నాయకులు దౌర్జన్యంగా గరికట్లను ఆక్రమించుకుని పాటలు నిర్వహించి వాటిని వేరే వారికి అప్పగించి ఏటా రూ.60 లక్షల వరకూ సొమ్ము జేబుల్లో నింపుకుంటున్నారు. దీంతో వేటనే ఆధారం చేసుకుని బతుకుతున్న మత్ప్యకారులు జీవనోపాధిని కోల్పోతున్నారు. మత్స్యకార సొసైటీలు సైతం అలంకారప్రాయంగా మారుతున్నాయి.

ఎక్కడ చూసినా అనధికార గరికట్లు

నరసాపురం మండలం మోడి ఎల్‌బీచర్ల, లక్ష్మణేశ్వరం, వేములదీవి, పసలదీవి గ్రామాల్లో ఉన్న కాలువలు, డ్రెయిన్లపై స్థానిక మత్స్యకారులు తరతరాలుగా వేట సాగిస్తున్నారు. మత్స్యకార సొసైటీల ద్వారా అనుమతి తీసుకుని, సొసైటీకి నిర్ధేశించిన మొత్తాన్ని ఏటా చెల్లించి వేట సాగించే విధానం అమల్లో ఉంది. దీనితో మత్స్యకారులకు ఉపాధితోపాటు సదరు మత్స్యకార సొసైటీకి ఆదాయం రావడం ద్వారా మత్స్యకారుల అభివృద్ధికి దోహదమవుతుంది. అయితే ఇటీవల ఆయా గ్రామాల్లోని కొందరు టీడీపీ నాయకులు కాలువలు, డ్రెయిన్లను దౌర్జన్యంగా ఆక్రమించుకుని తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. స్థానిక మత్స్యకారులు వేట సాగించకుండా కట్టుదిట్టం చేసి దోపిడీ పర్వం కొనసాగిస్తున్నారు.

ఏటా రూ.60 లక్షల వరకూ దోపిడీ

19 కిలోమీటర్ల సముద్ర తీరప్రాంతం ఉన్న నరసాపురంలో 2 లక్షల వరకూ మత్స్యకార జనాభా ఉంది. 90 శాతం మంది ఇందులో వేటనే వృత్తిగా చేసుకుని జీవిస్తున్నారు. టీడీపీ నాయకులు ఇతర ప్రాంతాలకు చెందిన మత్స్యకారేతరులకు గరికట్లు అప్పగించడంతో స్థానిక మత్స్యకారులు ఉపాధి లేక వలసలు పోతున్నారు. దర్బరేవు డ్రెయిన్‌పై 11, వెస్ట్‌ కుక్కిలేరుపై 6, పరకాలశేషావతారం కాలువపై 11 అనధికార గరికట్లు ఉన్నాయి. ఒక్కో దానికి పాటలు నిర్వహించి ఒక్కో గరికట్టుకు డిమాండ్‌ను బట్టి రూ.3 లక్షల నుంచి రూ.8 లక్షల వరకూ ఏడాదికి వసూలు చేస్తున్నారు. మొత్తంగా ఏటా రూ.60 లక్షలకుపైగా మత్స్యకార సొసైటీలకు చెందకుండా, ఇటు ప్రభుత్వానికి చెందకుండా, మత్స్యకారుల అభివృద్ధికి నోచుకోకుండా టీడీపీ నాయకుల జేబుల్లోకి వెళుతోంది. మత్స్యశాఖ అధికారులు సైతం లంచాల మత్తులో, రాజకీయ ఒత్తిళ్లతో నోరు మెదపడం లేదు. డ్రెయిన్ల శాఖ అధికారులు కూడా ఇదే తీరుతో వ్యవహరిస్తున్నారనే విమర్శ ఉంది.

మత్స్యకారేతరుల చేతిలో గరికట్లు

కాలువలు, డ్రెయిన్లలో యథేచ్ఛగా వేట

చక్రం తిప్పుతున్న గ్రామాల టీడీపీ పెద్దలు

ఏటా రూ.60 లక్షల దోపిడీ

మత్స్యకారుల జీవనోపాధికి గండి

నిబంధనలకు విరుద్ధంగా పాటలు పెట్టి గరికట్లు అప్పగించి స్థానిక మత్స్యకారుల పొట్టలు కొడుతున్నారు. వేట నిషేధ ఆజ్ఞలు కూడా ఉల్లంఘించి లక్షల్లో దండుకుంటున్నారు. అన్నీ తెలిసిన మత్స్యశాఖ అధికారులు ఏ చర్యలు తీసుకోవడం లేదు.

– బొడ్డు ఆశీష్‌కుమార్‌, ఎల్‌బీచర్ల మత్స్యకార సొసైటీ అధ్యక్షుడు

ఎన్ని గరికట్లకు అనుమతి ఇచ్చారని సమాచారహక్కు చట్టం ద్వారా అడిగినా అధికారుల నుంచి సమాధానం లేదు. మత్స్యకారులు కానివారు పాటలు పెట్టి గరులు అప్పగించడం ఏమిటి. దీనిపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదు.

– తిరుమలశెట్టి వెంటకటేశ్వర్లు, ఎల్‌బీచర్ల మత్స్యకార సొసైటీ కార్యదర్శి

Advertisement
 
Advertisement
Advertisement