కష్టంగా హోటల్ వ్యాపారం
కై కలూరు: గ్యాస్ కొరతతో కట్టెల పొయ్యల కన్నీటి కష్టాలు తిరిగి ప్రత్యక్షమవుతున్నాయి. చిరు హోటల్ వ్యాపారులు కాలగమనంలో కలిసిపోయిన ఊక పొయ్యిలను మళ్లీ ఏర్పాటు చేసుకుంటున్నారు. కట్టెల పొయ్యల నుంచి వచ్చే పొగ కారణంగా ఉపిరితిత్తులు సమస్యలతో పూర్వం అధిక మరణాలు సంభవించాయి. దీంతో ప్రభుత్వాలు ఉజ్వల వంటి గ్యాస్ సరఫరా పథకాలను అమలు చేసింది. పొగబారిన జీవితాల నుంచి ప్రజలకు విముక్తి కలిగించడానికి గ్యాస్ సరఫరాను పల్లెలకు చేరువ చేసింది. పశ్చిమ ఆసియాలో యుద్ధం నేపధ్యంలో గ్యాస్ కొరతను సాకుగా చూపి కృత్రిమ గ్యాస్ కొరతను సృష్టిస్తున్నారు. దీంతో తిరిగి ఊక పొయ్యిలే దిక్కవుతున్నాయి.
కై కలూరు రైతుబజారు సమీపంలో కృపా హోటల్ యజమాని 6గురు సిబ్బందికి ఉపాధి కల్పిస్తున్నాడు. గ్యాస్ కొరతతో అధిక రోజులు హోటల్ మూసేయాల్సి వచ్చింది. దీనికి తోడు ఎండలు దంచికొడుతోన్నాయి. ఈ నేపథ్యంలో చివరకు రూ.50 వేలు వెచ్చించి ఊక పొయ్యిను కట్టించేశాడు. మరికొంత మంది హోటల్ యజమానులు కట్టల పొయ్యలను ఆశ్రయించారు. వంట తయారీదారులు పొగబారిన పడుతున్నారు. ఏం చేయమంటారండీ.. బ్లాక్‌లో గ్యాస్ సిలిండర్లను కొనలేకపోతున్నాం.. పెట్టుబడులు, సప్లయర్ల జీతాలు కూడా రావడం లేదని ఓ చిరు హోటల్ యజమాని ఆవేదన వ్యక్తం చేశాడు.
జీవన పోరాటంలో ఉక్కపోత
నిత్యవసర వస్తువుల్లో ప్రధానమైన గ్యాస్ కొరతతో గతించిన వంట పద్ధతులు తిరిగి వెలుగులోకి వస్తున్నాయి. ఊక పొయ్యి ఏర్పాటుకు రూ.50 వేలు ఖర్చవుతోంది. ఇందులో ముడిసరుకుగా వినియోగిస్తున్న బస్తా ఊక రూ.170 పలుకుతుంది. పూర్వం ఊక బస్తా రూ.70 పలికింది. అదే కేజీ కట్టెలు రూ.30 పలుకుతున్నాయి. ఓ చిన్న హోటల్‌లో 3 బస్తాల ఊకకు రూ.510 ఖర్చు అవుతుంది. ఇదే కట్టెలతో వంటకాలు చేస్తే రూ.600వరకు ఖర్చు చేస్తున్నారు. ఇదే గ్యాస్ విషయానికి వస్తే రూ.1500 ఖర్చు చేయాల్సి వస్తుంది. పెరిగిన గ్యాస్ ధరలు, కొరత కారణంగా ఊక, కట్టెల పొయ్యిల మధ్య హోటల్ సిబ్బంది ఉక్కపోత, వేడిని భరిస్తున్నారు.
వాణిజ్య సిలిండర్‌పై రూ.900 పెంపు
దేశంలో ఎన్నికల ప్రక్రియ ముగియడంతో కేంద్రంలో వాణిజ్య గ్యాస్ సిలిండర్‌పై ఏకంగా రూ.900 కేంద్రం పెంచేసింది. గతేడాది ఏప్రిల్‌లో చివరిసారిగా రూ.50, ఇటీవల మరో రూ.60 గృహ వినియోగ సిలిండర్‌పై కేంద్రం పెంచింది. వాణిజ్య కనెక్షన్లపై ఇటీవల రూ.115 పెరిగింది. తాజాగా వాణిజ్య గ్యాస్ సిలిండర్‌పై మరో రూ.900 ఒకేసారి పెంచేసింది. కొద్ది రోజుల ముందు వాణిజ్య సిలిండర్ రూ.2, 370 ఉంది. ఏకంగా రూ.900 పెంచడంతో రూ.3,270కు చేరింది. ఇప్పటికే బ్లాక్‌లో వాణిజ్య సిలిండర్ రూ.3 నుంచి రూ.4 వేలకు విక్రయిస్తున్నారు. ఇది మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఈ కారణంతో హోటల్ యజమానులు ఊక, కట్టెల పొయ్యల వైపునకు మళ్లుతున్నారు.
హోటల్ వ్యాపారం కష్టతరంగా మారుతోంది. ఇప్పటికే ముడి సరుకుల ధరలు విపరితంగా పెరిగాయి. క్వాలిటీ సరుకు అందించపోతే కస్టమర్లు రావడం లేదు. ఈ నేపథ్యంలో గ్యాస్ కొరత ఏర్పడింది. వాణిజ్య గ్యాస్ సిలిండర్లు దొరకని పరిస్థితి. పైగా అమాంతం రేటు పెంచేశారు. దీంతో నేను రూ.50 వేలు వెచ్చించి ఊక పొయ్యిను ఏర్పాటు చేసుకున్నాను.
–కసిలంకి ఆంజనేయులు, హోటల్ యజమాని, కై కలూరు
టిఫిన్ సెంటర్ల పరేషాన్
గ్యాస్ కొరతతో ఊక పొయ్యిల ఏర్పాటు
పెరిగిన ధరలు తట్టుకోలేక కట్టెలతో వంటకాలు
వాణిజ్య గ్యాస్ సిలిండర్లపై రూ.900 పెంపు


