కైకలూరు: అమ్మా.. పెద్దింట్లమ్మా.. నీ చల్లని దయ మాపై చూపవమ్మా.. అంటూ భక్తులు ఆర్తితో కొల్లేటికోట పెద్దింట్లమ్మను వేడుకున్నారు. సమీప జిల్లాల నుంచి వేసవి సెలవులు ముగియనుండటంతో వేలాదిగా భక్తులు అమ్మవారిని ఆదివారం దర్శించకున్నారు. అమ్మవారికి మహిళలు వేడి నైవేద్యాలు సమర్పించారు. ఆలయ ఉప ప్రధాన అర్చకుడు పేటేటి పరమేశ్వర శర్మ ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఒక్క ఆదివారం అమ్మవారికి ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశఖండన, పెద్ద, చిన్న తీర్థాలు, లడ్డూ ప్రసాదం, గదుల అద్దెలు, అమ్మ ఫొటోల విక్రయం, వాహన పూజలు, విరాళాల ద్వారా రూ.81,206 ఆదాయం వచ్చిందని తెలిపారు.
బుట్టాయగూడెం: బుట్టాయగూడెం మండలం కామవరం సమీపంలో అటవీ ప్రాంతంలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ప్రత్యేక బస్సుల్లో తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు. అనంతరం దూపదీప నైవేద్యాలతో అమ్మవారికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అధికంగా తరలివచ్చిన భక్తుల వల్ల ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ కమిటీ వారితోపాటు పోలీసులు కూడా బందోబస్తు నిర్వహించారు.
కాళ్ల: స్వయంభూ కాళ్ళకూరు శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధి పనులకు ఆకివీడు మండలం ఐ.భీమవరం గ్రామానికి చెందిన దివంగత వేగేశ్న అప్పలరాజు జ్ఞాపకార్థం భార్య నాగమణి, కుమారులు బాపిరాజు, గోపాలకృష్ణంరాజు, ప్రసాదరాజు రూ.3 లక్షలు విరాళం అందించారు. దేవాలయం చుట్టూ మాడవీధుల విస్తరణలో భాగంగా స్థలం కొనుగోలు నిమిత్తం దాతలు ఈ విరాళం అందించినట్లు దేవస్థానం చైర్మన్ అడ్డాల శివరామరాజు, ఈవో మోకా అరుణ్ కుమార్ ఆదివారం తెలిపారు. ఈసందర్భంగా దాతలకు ప్రత్యేక దర్శనం కల్పించి స్వామివారి ప్రతిమతో సత్కరించారు.
నూజివీడు: పట్టణ పరిధిలోని మామిడి తోటల్లో పార్టీ పేరుతో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై పోలీసులు ఆదివారం మెరుపుదాడి చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు సిబ్బందితో కలిసి సీఐ పీ సత్యశ్రీనివాస్ పేకాట శిబిరంపై దాడి చేశారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న 22 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.39,700 నగదును సీజ్ చేయడంతో పాటు 18 సెల్‌ఫోన్లు, 13 మోటర్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.


