గిరి సీమల్లో సంబరం | - | Sakshi
Sakshi News home page

గిరి సీమల్లో సంబరం

May 31 2026 1:06 AM | Updated on May 31 2026 1:06 AM

సందడే సందడి

వెల్లివిరిసే ఆధ్యాత్మిక శోభ

తొలకరి వేళ వైభవంగా భూదేవి పండుగ

వర్షాలతో కరుణించమని వన దేవతలకు పూజలు

మన్యం గ్రామాల్లో ఆధ్యాత్మిక శోభ

బుట్టాయగూడెం: మారుతున్న కాలంలోనూ చెరిగిపోని సంస్కృతికి, తరతరాలుగా వస్తున్న నమ్మకానికి పశ్చిమ ఏజెన్సీ ప్రాంతం అద్దంపడుతోంది. బుట్టాయగూడెం మండలంలోని గిరిజన గ్రామాల్లో మరో వారం రోజుల పాటు ఈ ఆధ్యాత్మిక శోభ కొనసాగనుంది. తొలకరి వేళ ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమవుతున్న సమయంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తూ వందేళ్ల నాటి సంప్రదాయాన్ని ఆదివాసీ గిరిపుత్రులు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. జడి ప్రక్రియతో మొదలై ఆటపాటలు, ఊయల ఉత్సవాలు, వేట వంటి విభిన్న సాంస్కృతిక ఆచారాలతో ఈ వేడుకలు జరుగుతాయి. భూదేవి పండుగగా పిలిచే ఈ గిరిజన సాంప్రదాయ ఉత్సవాలు ఇప్పటికే ప్రారంభం కాగా, మరొక వారం రోజుల్లో అన్ని గిరిపల్లెల్లోనూ జరగనున్నాయి. ఇందుకోసం గిరిజనులు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన గ్రామాల్లో బాట పండగ, పప్పుల పండుగ, మామిడికాయ పండగ లాంటి అనేక పండుగలు జరిగినప్పటికీ, వాటిలో భూదేవి పండుగ అత్యంత ప్రధానమైనది. భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశం అనే పంచభూతాలను దైవంగా భావించి ప్రకృతిని కొలిచే ఆచారం ఇక్కడ నేటికీ సజీవంగా ఉంది. ఆదివాసీ గిరిజనులకు ఆధునిక ప్రపంచపు పోకడలతో, కొత్త టెక్నాలజీలతో పనిలేదు. వారు నమ్ముకున్న ప్రకృతి, వనాలే వారి దేవుళ్లు. తొలకరి జల్లులు కురిసే వేళ ఎంతో వైభవంగా భూమి తల్లికి పూజలు చేసి, ఆపై నాగలి పట్టి వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు.

భావి తరాలకు ఆదర్శంగా పండుగలు

ఆచార వ్యవహారాలకు, కట్టుబాట్లకు నిలయమైన గిరిపుత్రులు తమ సాంస్కృతిక సంప్రదాయాలను ప్రాణంగా కాపాడుకుంటూ భావితరాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇది ఊరి పండుగ కావడంతో ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొంటారు. పండుగ మొదటిరోజు గ్రామంలో గంగానమ్మ దేవతకు కోడిని కోసి నైవేద్యంగా పెడతారు. అనంతరం ఇప్పచెట్టు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, గ్రామ ప్రజలంతా ఒకచోట కూర్చుని సహపంక్తి భోజనం చేస్తారు. రెండవరోజు ఉదయం గంగానమ్మకు గ్రామ పెద్ద ప్రత్యేక పూజలు చేశాక, గుడి ఎదుట గిరిజన మహిళలు సంప్రదాయ నృత్యాలు చేస్తారు.

ఆకట్టుకునే బావా మరదళ్ల సందడి

మొదటిరోజు రాత్రి పూజలు చేసిన ఇప్పచెట్టుకు ఏడు గజాల దూరంలో పేడతో కళ్లాపి చల్లి ముగ్గులు వేస్తారు. ఆ ముగ్గులో నాటుకోడి గుడ్డును ఉంచి, మొదట మహిళలు, తర్వాత పురుషులు బాణంతో ఆ గుడ్డును పగలకొడతారు. ఆ సమయంలో మహిళలు పురుషులపై పేడ నీళ్లు చల్లుతూ పరుగులు పెట్టిస్తారు.

అలా పరుగులు తీసిన మగవారు బాణాలు పట్టుకుని అడవికి వేటకు వెళతారు. సాయంత్రం వేళ వేటతో తిరిగి వచ్చాక, శరీరానికి పేడ పూసుకుని స్నానం చేసి ఇంట్లోకి వెళతారు. వేటలో తెచ్చిన జంతువును వండి, మళ్లీ ఊరంతా కలిసి విందు భోజనం చేస్తారు. ఈ పండుగ సమయంలో మహిళలు లయబద్ధంగా చేసే సాంప్రదాయ రేల నృత్యాలతో పాటు బావా మరదళ్ల సందడి గ్రామాల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపుతుంది.

నాటుకోడి గుడ్డును బాణంతో కొడుతున్న మహిళలు (ఫైల్‌)

పురుషులపై పేడ నీళ్లు చల్లుతున్న మహిళలు (ఫైల్‌)

భూదేవి పండగ జరిగే రెండు రోజులు గ్రామాల్లో ఎంతో సందడి నెలకుంటుంది. భక్తి శ్రద్దలతో పూజలు చేయడమే కాకుండా రేలా నృత్యాలు ఎంతో ఉత్సాహాన్నిస్తాయి. ఇవి తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. రేపటి తరాలకు కూడా గుర్తుండేలా భూదేవి పండుగ చేస్తాం.

– తెల్లం దేవరాజు,

కంసాలికుంట, బుట్టాయగూడెం మండలం

తొలకరిలో వ్యవసాయ పనులు మొదలు పెట్టక ముందే భూదేవి పండగ చేయడం మా సాంప్రదాయం. మా పూర్వీకుల నుంచి ఇది వస్తోంది. పండుగ చేసిన తర్వాతే వ్యవసాయ పనులు ప్రారంభిస్తాం. పండుగ రెండు రోజులు గ్రామాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లి విరుస్తుంది.

– వెట్టి పెంటమ్మ, కాకులవారిగూడెం. బుట్టాయగూడెం మండలం

Advertisement
 
Advertisement
Advertisement